అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి జనసేన పార్టీలో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంటోంది. 2014లో అనంతపురం టిక్కెట్‌ ముందుగా ఒకరి పేరును ప్రకటించిన చంద్రబాబు ఆఖరి నిమిషంలో ప్రభాకర్‌చౌదరి కి పోటీ చేసే అవకాశం కల్పించి గెలిపించారు. కాంగ్రెస్‌ సంస్కృతిని ఒంటబట్టించుకున్న ప్రభాకర్‌చౌదరి 1994 తరువాత ఆ పార్టీకి దూరమైన టిడిపిలో చేరి అనంతపురం మున్సిపల్‌ ఛైర్మన్‌గా విజయం సాధించారు. తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి రాజకీయంగా తెరమరుగై ఫ్యాక్షన్‌ వ్యతిరేక సంస్థను ఏర్పాటు చేసి కొన్నాళ్లు హడావుడి చేసి మళ్లీ టిడిపిలో చేరారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే జెసి కుటుంబంతో ప్రభాకర్‌చౌదరి కి వైరం ఉండేది. కొంత కాలం చెరో పార్టీలో ఉన్నా 2014లో ఇద్దరూ ఒకపార్టీ తరుపున పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో ప్రభాకర్‌చౌదరికి మరో సారి టిక్కెట్‌ రాదని, మరొకరికి టిక్కెట్‌ వస్తుందని అనంతపురంలో జెసి అనుచరులు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నా కొంత కాలం మౌనంగా ఉన్నా ఇటీవల చంద్రబాబును కలసి పరిస్థితిని వివరించారు. గతంలో టిడిపి అభ్యర్థిగా ముందుగా ప్రకటించిన నాయకునికి ఈసారి టిడిపి టిక్కెట్‌ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించడం,

జెసి కుటుంబం చేస్తోన్న విమర్శలను తట్టుకోలేని ప్రభాకర్‌ చౌదరి త్వరలో జనసేన లో చేరే అవకాశం ఉందని అనంతపురంలో ప్రచారం జరుగుతోంది.  ఈ ప్రచారాన్ని చౌదరి కొట్టిపారేస్తున్నా సోషల్‌మీడియాలో రోజు రోజుకు ప్రచారం ఉదృతం అవుతోంది. నమ్మకంతో సీటు ఇచ్చి గెలిపిస్తే బాహాటంగా బజారున పడతారా ? ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలువిసిరితే తన దృష్టికి తేవాలి తప్ప ప్రభాకర్‌చౌదరి కూడా అదేవిధంగా వ్యవహరిస్తారా ఏదైనా ఉంటే తన దృష్టికి తేవాలి కానీ ఇలా వ్యవహరిస్తే ఎలా ? అని చంద్రబాబు రుసరుసలాడుతున్నారు. ఒకటి మాత్రం నిజం జెసి కుటుంబాన్ని వదులుకునేందుకు చంద్రబాబు ఇష్టపడరు. జెసి కుటుంబానికి ఇష్టం లేకుండా చౌదరి కి టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పరిస్థితిని గమనించిన చౌదరి జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పట్టణంలో ఉన్న బలిజ ఓటర్లను ఆకర్షిస్తే తన గెలుపు సులువతుందని అందుకే ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా టిడిపిలో సర్దుకుని కొనసాగినా మళ్లీ పోటీకి టిక్కెట్‌ దక్కదు. టిక్కెట్‌ దక్కకపోయినా పార్టీలో పనిచేస్తే ఏదైనా పదవి ఇస్తారా ? అంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఆయనకు స్వకులంలో ఎంత వరకు పట్టు ఉందో లేదో తెలియదు కానీ కౌన్సిల్‌ చీప్‌విఫ్‌ పయ్యావుల కేశవ్‌ జెసికి మద్దతు ఇస్తున్నారు. మంత్రి సునీత, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, సూరి కూడా చౌదరి కి మద్దతు ఇవ్వడం లేదు. చివరకు ప్రభాకర్‌చౌదరికి జనసేనలో చేరే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వకున్నా పార్టీలో కొనసాగి కొన్నాళ్లు మౌనంగా ఉండాలనే వ్యూహంతో చౌదరి ఉన్నారని తెలుస్తోంది. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.