ముందస్తు ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఆపై అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు నేతలు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి కాలనీలు, బస్తీ ల్లో పర్యటిస్తున్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో అనూహ్యంగా తెరమీదకు వచ్చి టికెట్‌ సాధించిన కొత్త వ్యక్తులు ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ కేడర్‌తోపాటు స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రెండు, మూడు రోజుల్లో నగరంలో తారలు సందడి చేయనున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి తరపున బరిలోకి దిగిన టీడీపీ నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత వెనిగళ్ల ఆనంద ప్రసాద్‌ అలియాస్‌ భవ్య ఆనంద్‌ప్రసాద్‌ను గెలిపించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రంగంలోకి దిగనున్నారు. అలాగే ఉప్పల్‌, సనత్‌నగర్‌ నుంచి ప్రజాకూటమి నుంచి పోటీకి దిగిన తూళ్ల వీరేందర్‌గౌడ్‌, కూన వెంకటే్‌షగౌడ్‌కు మద్దతుగా ఇటు చంద్రబాబు, అటు బాలకృష్ణ వేర్వేరుగా ప్రచారం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కూటమి అభ్యర్థుల తరపున చంద్రబాబు, బాలకృష్ణ ప్రచారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న ప్రజాకూటమి అభ్యర్థులు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపైనే

ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి తన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటూ ఆయన ప్రచారం చేపట్టనున్నట్లు సమాచారం. సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో ఆయన రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కంచుకోట కూకట్‌పల్లి నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. ఈ సెగ్మెంట్‌ నుంచి అధికార టీఆర్‌ఎస్‌ తరపున మాధవరం కృష్ణారావు పోటీ చేస్తుండగా, కూటమి తరపున టీడీపీకి చెందిన స్వర్గీయ నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని బరిలోకి దిగారు. అలాగే బీజేపీ నుంచి ఎం.కాంతారావు పోటీ చేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనేందుకు సుహాసిని సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎస్‌ ఓట్లతో పాటు ఇతరుల ఓట్లను పొందేందుకు తన తమ్ముడు, ప్రముఖ సినీహీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, బాబాయి నందమూరి బాలకృష్ణలు ఆమె తరపున ప్రచారం చేయనున్నారు. కూకట్‌పల్లిలో కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని విజయం కోసం ఆమె కుటుంబసభ్యులు ఒక్కొక్కరు ప్రచారంలో పాల్గొంటున్నారు. సుహాసిని నామినేషన్‌ రోజున బాబాయి బాలకృష్ణ ఆమె వెంటే ఉన్నారు. కాగా, నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు, సుహాసిని స్నేహితులు 50 మంది వరకు ఆమె గెలుపు కోసం పని చేస్తున్నారు. ఇందులో భాగంగా 28, 29 తేదీల్లో చంద్రబాబునాయుడు కూకట్‌పల్లిలో రోడ్‌ షోకు వస్తున్నట్లు సమాచారం. సోదరిని గెలిపించుకునేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ 27 నుంచి మూడు రోజులపాటు 27,28,29 న  పర్యటించనున్నారు. సినిమా షెడ్యూల్‌ను బట్టి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తన విజయం కోసం కృషి చేస్తారని ఇప్పటికే నందమూరి సుహాసిని ప్రకటించారు.