దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి త్వరలో కోడలు రానుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి… ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. మరోవైపు రాజమౌళి తన కొడుకు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ.. తండ్రి చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేస్తూ కొన్ని సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. కొన్నాళ్లుగా అతడు గాయని పూజా ప్రసాద్‌ను ప్రేమిస్తున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించడంతో నిశ్చితార్ధం జరుపుకున్నారు. వీరి నిశ్చితార్ధానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, అఖిల్ వంటి తారలు వీరి నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. వీరిద్దరి వివాహం డిసెంబర్ 30న జైపూర్‌లో అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇంతకీ ఈ పూజా ప్రసాద్ ఎవరో కాదు.. నటుడు జగపతి బాబు అన్నయ్య రామ్ ప్రసాద్ కుమార్తె. రాజమౌళికి కాబోయే కోడలు పూజా ప్రసాద్ గురించి చాలామందికి ఇప్పటికే తెలుసు. సంగీత ప్రియులందరికీ.. ముఖ్యంగా భక్తి పాటలతో పారవశ్యం పొందే వారికి పూజా ప్రసాద్ గాయనిగా సుపరిచితురాలు. ఆధ్యాత్మిక గాయనిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

 

చిన్న వయసు నుంచే సంగీతంలో ప్రావీణ్యం పొందిన పూజ పలు భక్తి గీతాలు ఆలపించింది. సంగీత విభావరిలలో ఆమె పాటలు ఎందరినో భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఆమె ఆలపించిన భక్తి గీతాలు మార్కెట్‌లో విరివిగా అమ్ముడుపోయాయి.  ఈ సందర్భంగా మూడు రోజుల పాటు వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు రాజమౌళి కుటుంబంతో పాటు టాలీవుడ్ తారాగణం జైపూర్ కు తరలి వెళ్లింది. ప్రముఖ హీరోలు అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, రానా, జగపతిబాబు తదితరులు బయలుదేరి వెళ్లారు.