నారా లోకేశ్ నామినేషన్‌ విషయంలో ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఆయన నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు. దీంతో మంగళగిరిలో టీడీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున నారా లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్‌పై రిటర్నింగ్‌ అధికారి అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన నోటరీ కృష్ణా జిల్లా చిరునామాతో ఉందని.. ఆ నోటరీ గుంటూరు జిల్లాలో చెల్లదంటూ అభ్యంతరం తెలిపారు. నోటరీ చట్టంలోని సెక్షన్‌ 9 ప్రకారం నారా లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం చెల్లదని పేర్కొన్నారు. అదనపు పత్రాల కోసం లోకేశ్‌కు రిటర్నింగ్‌ అధికారి 24 గంటల గడువు ఇచ్చారు. దీంతో నారా లోకేశ్.. తాజాగా మంగళగిరి అడ్రస్‌తో సరిచేసిన నోటరీ సమర్పించినట్లు తెలుస్తోంది. లోకేశ్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో ఇంటి అడ్రస్ తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉంది. కానీ, నోటరీ చేసింది మాత్రం కృష్ణాజిల్లాకు చెందిన లాయర్ సీతారామ్. గుంటూరు జిల్లా

తన పరిధిలోకి రానప్పుడు సీతారామ్ ఎలా నోటరీ చేస్తారని వైసీపీ అభ్యర్థి ఆర్కే ప్రశ్నించారు. నోటరీపై సమాధానం చెప్పాలని నిలదీయగా.. వివరణ ఇచ్చేందుకు లోకేశ్ తరపు న్యాయవాది సీతారామ్‌ ఎన్నికల అధికారిని కొంత సమయం అడిగారు. నోటరీ రూల్స్ ప్రకారం లోకేశ్ నామినేషన్ చెల్లదని వైసీపీ నేతలు పేర్కొన్నారు. తప్పుడు నామినేషన్ పత్రాలు ఇచ్చినందుకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో లోకేశ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు, కార్యకర్తలు కలవరపడ్డారు. నోటరీ వ్యవహారంపై లోకేశ్, ఆయన తరపు లాయర్లు ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన లోకేశ్.. మార్చి 22న మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచి వైసీపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. మరొక పక్క కురుపాం రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి జనార్ధన థాట్రాజు నామినేషన్ తిరస్కరణకు గురైంది. కుల ధ్రువీకరణపత్రంలో తేడా ఉండడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు. ఇదిలా ఉంటే కురుపాం బరిలో థాట్రాజు తల్లి నరసింహప్రియ ఉండనున్నారు. ముందుగానే ఆమె డమ్మీ నామినేషన్ వేశారు. జనార్ధన థాట్రాజుపై బీజేపీ అభ్యర్ధి నిమ్మక జయరాజ్ ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు.