
పశ్చిమ గోదావరిజిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయం ఆసక్తిగా మారింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎలా రెచ్చిపోయారో .. రాష్ట్రం మొత్తానికి తెలిసిందే. దళితులను, అణగారిన వర్గాలను ఆయన దూషించడం, కొట్టడం, అధికారులపై పెత్తనం చేయడం వంటివి అప్పట్లో తీవ్ర వివాదం సృష్టించాయి. మహిళా ఎమ్మార్వోపై దగ్గరుండి మరీ దాడి చేయించారు. అధికారంలో ఉండగా ప్రభుత్వం అండగా ఉందన్న ధీమాతో చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. తనపై వ్యతిరేక వార్తలు రాసిన రిపోర్టర్లను కూడా బెదిరించి వారిపై కేసులు పెట్టించారు. ఇక, పేదలపై పెత్తనం చేశారు. ఎవరిని బడితే వారిని దూషించడం చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేయడం చింతమనేని ప్రభాకర్ కే చెల్లింది. ఇటు సొంత పార్టీలో సీనియర్ నేతలపై కూడా చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మొత్తంగా అధికారం చూసుకుని రెచ్చిపోయిన చింతమనేని ప్రభాకర్ ఎంతో మందిని అనవసరమైన కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపించారని టాక్ ఉంది. దెందులూరు నియోజకవర్గంలో ఆయనకు ఎవరైనా
వ్యతిరేకంగా మాట్లాడితేనే వారిపై కేసులు పెట్టి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నా వార్తలు ఉన్నాయి. కట్ చేస్తే.. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ కూడా అదే జైలుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దళిత వర్గాలను తిట్టి దూషించిన నేరంపై చింతమనేని ప్రభాకర్ ని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఓ పదిహేను రోజుల పాటు ఆయన తప్పించుకుని తిరిగారు. ఇంతలోనే మంత్రి బొత్స సత్యనా రాయణ చింతమనేని ప్రభాకర్ కి కౌంటర్ ఇచ్చారు. తప్పు చేశాడు కాబట్టే ఆయన పారిపోయారని అన్నారు. దీంతో చింతమనేని ప్రభాకర్ నేరుగా ఇంటికి వచ్చి పోలీసులకు లొంగి పోతానని ప్రకటించారు. అయితే, ఆయన లొంగిపోక ముందుగానే పోలీసులు ఆయనన ఇంటికి వెళ్తున్న దారిలోనే వెంబడించి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనకు జిల్లా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ ఫ్యూచర్ ఏంటనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోపక్క, చింతమనేని వ్యవహారంలో వేలు పెట్టేందుకు చంద్రబాబు సహా ఎవరూ కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇక జిల్లా టీడీపీలో ఆయనకు సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు మినహా ఆయన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. పోలీసు వర్గాల కథనం మేరకు చింతమనేనిపై 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా చింతమనేని బాధితులు పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతూనే ఉన్నారు. మరి ఈ కేసుల నుంచి ఎలా బయట పడతారో ? పడినా పోటీకి అనర్హుడు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది, అదే జరిగితే చింతమనేని స్థానంలో ఆయన భార్యకు అవకాశం లభిస్తుందని అంచనాలు ఉన్నాయి. చూడాలి మరేం జరుగుతుందో.