గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా టీడీపీలో చేరి.. ప్రసంగాలతో పార్టీ అధినేత దృష్టిని ఆకర్షించి.. టికెట్ ఆశించి.. భంగపడి.. చివరికి వైసీపీలో చేరి ప్రత్తిపాటిని ఓడిస్తానని శపథం చేసిన ఓ ఎన్నారై మహిళా నేత వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విడదల రజనీకుమారికి చిలకలూరిపేట టికెట్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీకి భారీగా ఫండ్ ఇవ్వడానికి ఆమె ముందుకు రావడంతో టికెట్ ఆమెకే ఖరారు చేసినట్లు సమాచారం. పైగా ఎన్నికల్లో అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని రజనీకుమారి పూర్తి హామీ ఇచ్చారట. దీంతో మర్రి రాజశేఖర్‌తో పోల్చుకుంటే రజనీనే పార్టీ అభ్యర్థిగా సమర్థురాలనే భావన వైసీపీ అధినేత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమెను నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఊహించని ఈ పరిణామంతో మర్రి రాజశేఖర్ వర్గం షాక్‌కు గురైంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తమ నేతను కాదని నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వారిని సమన్వయ కర్తగా నియమిస్తారా అంటూ మర్రి రాజశేఖర్ వర్గం అధిష్ఠానం తీరుపై మండిపడింది.


గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనీని జగన్ నియమించడంతో ఆయన వర్గంలో అసంతృప్తి భగ్గుమంది. మర్రి రాజశేఖర్ నివాసానికి వందలాదిగా తరలివచ్చిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలు జగన్‌ను బహిరంగంగా విమర్శించారు. తిట్ల దాడి చేశారు, ఇంత నమ్మక ద్రోహం ఏంటని నిప్పులు చెరిగారు. చిలకలూరిపేట మండల వైసీపీ అధ్యక్షులు చాపలమడుగు గోవర్ధన్‌ మాట్లాడుతూ మాట తప్పను. మడం తిప్పను అన్న అర్థాన్ని జగన్‌మోహనరెడ్డి కూనీ చేశారని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్తగా పార్టీలో చేరినవారిని నియమించారంటే జగన్‌ మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడని అర్థమవుతుందన్నారు. సుమారు వివిధ పదవుల్లోని 404 మంది వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. మర్రి రాజశేఖర్ వెంటే మేమంతా ఉంటామని ప్రకటించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుబాని మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి జిల్లాలో వెన్నుదన్నుగా నిలిచిన రాజశేఖర్‌ను జగన్‌ విస్మరించడం మంచిది కాదని తెలిపారు. పార్టీ ఫండ్‌ ఇస్తే ఎవరికైనా పదవులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇది రాజశేఖర్‌ ఒక్కడికి జరిగిన అన్యాయం కాదని నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ అన్యాయంగా తాము భావిస్తున్నామని వివరించారు. మనస్తాపంతో రాజీనామా చేస్తున్నామన్నారు. రాజశేఖర్‌ను కాదని డబ్బున్న వ్యక్తిని సమన్వయకర్తగా నియమించడం సిగ్గుచేటని తెలిపారు. చిలకలూరిపేట మండలంలోని వైసీపీ పదవులలో ఉన్న వారందరూ రాజీనామాలు చేశారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో రాజశేఖర్‌ను గెలిపించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతానని పేర్కొన్నారు. అయితే రజనీకుమారి మాత్రం మర్రి రాజశేఖర్‌తో కలసి పనిచేస్తానని ప్రకటించడం కొసమెరుపు.