మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్‌రెడ్డి రాజకీయ వారసుడు రామ్‌కుమార్‌రెడ్డి బిజెపిని వీడి వైకాపాలో చేరాలా లేక టిడిపిలో చేరాలా ? అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైకాపాలో చేరి వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆనం చెప్పడంతో అప్పటి వరకు వైకాపాలో చేరి అక్కడ నుంచే పోటీ చేయాలని ఆశపడ్డ రామ్‌ కుమార్‌ రెడ్డి షాక్‌ తిని టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే వెంకటగిరి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రామ్‌కుమార్‌రెడ్డి కి ఇవ్వలేమని  ఆయనకు నెల్లూరు పార్లమెంట్‌ సీటు ఇస్తామని టిడిపి పెద్దలు చెప్పారట. ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే విజయం సాధిస్తానా లేదా  అనే అంశం పై  రామ్‌కుమార్‌రెడ్డి సర్వే చేయించుకుంటున్నారట. బిజెపికి రాజకీయ భవిష్యత్‌ లేదు, వైకాపా లో జగన్ అహంకారం భరించలేము అని,

తెదేపా నే బెటర్ అని అనుచరులు బలవంత పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే చాలా తర్జన భర్జనల తర్వాత ఆయన వైకాపా తీర్ధం పుచ్చుకోటానికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌‌ను శనివారం రోజు ఆయన కలిశారు. అయితే పార్టీలో చేరిక ఏ రోజు అనే విషయం మాత్రం తెలియరాలేదు. రాంకుమార్‌రెడ్డికి టిక్కెట్ హామీ ఇచ్చారా..? లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు. కాగా కొద్దిరోజుల క్రితం మాట్లాడిన ఆయన.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి నాల్గవ వర్ధంతిని పురస్కరించుకుని కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతానని, 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీచేసి, విజయం సాధిస్తానని, ఇంత కాలం రాజకీయంగా నీరసించిన నేదురుమల్లి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతామని చెప్పుకొచ్చారు. రాం కుమార్‌రెడ్డి ప్రసంగిస్తుండగా.. మధ్యలో ఓ అభిమాని మన పార్టీ ‘వైసీపీ’ అంటూ గట్టిగా అరవగా.. దీనికి స్పందించిన ఆయన మీ అభిప్రాయాలను మరో 3 నెలలు మనసులోనే ఉంచుకోవాలి. మీ అందరి మనసుల్లో ఏ పార్టీ అనుకుంటున్నారో అదే పార్టీ నుంచి వెంకటగిరిలో పోటీ చేస్తానని చెప్పారు. అనుకున్నట్లుగానే ఆయన మూడు నెలల తర్వాత జగన్‌ను కలవడంతో నేదురుమల్లి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.