స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో మత్తు వైద్యునిగా పనిచేస్తూ సస్పెండైన డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. విశాఖ ఘటనకన్నా ముందు ఏప్రిల్‌ ఆరో తేదీన నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ మీడియాతో మాట్లాడిన విషయాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి.డాక్టర్‌ సుధాకర్‌ అరెస్టు, మానసిక ఆస్పత్రికి తరలింపు వ్యవహారంపై ప్రభుత్వం సమర్పించిన నివేదికకు, సుధాకర్‌ నుంచి వాంగ్మూలాన్ని సేకరించిన జిల్లాకు చెందిన న్యాయమూర్తి ఇచ్చిన నివేదికకు పొంతన లేకపోవడంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరిగిందో తేలాల్సిందే అంటూ హైకోర్టు పేర్కొనడం గమనార్హం. డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు ఏపీ ప్రభుత్వం వెళ్లనుంది. న్యాయనిపుణలతో చర్చల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందునే డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు వేశామని ప్రభుత్వం వాదనలు వినిపింది.