ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారంపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్టు న్యాయవర్గాలు చెబుతున్నాయి. బిల్లుల పరిశీలనకు 8 మందితో సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తీర్మానించినా… కమిటీ ఏర్పాటు చేయలేదని దీపక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సెలక్ట్ కమిటీ విషయంలో మండలి కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. మండలి చైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించారని న్యాయస్థానానికి విన్నవించారు. అధికారపక్షానికి మండలి సెక్రటరీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. క్విడ్ ప్రోకో కింద మండలి సెక్రటరీ పదవీకాలం కూడా పొడిగించారని తన పిటిషన్‌లో తెలిపారు. ప్రతివాదులుగా మండలి కార్యదర్శి, ప్రభుత్వం, సహాయ కార్యదర్శి పేర్లను దీపక్ రెడ్డి తన పిటిషన్‌లో చేర్చారు. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ సర్కారు తీసుకొచ్చిన రెండు బిల్లులను.. శాసన మండలి ఛైర్మన్‌గా తనకున్న విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపాలని షరీఫ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. శాసన మండలి చైర్మన్ సర్వాధికారి అని, ఆయన ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని పిటిషన్‌లో దీపక్ రెడ్డి తెలిపారు. విశేష అధికారాలనుపయోగించి సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తే.. మండలి కార్యదర్శి వాటిని పక్కన పెట్టేశారని పిటిషన్‌లో ఉటంకించారు.