వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పై ఆంధ్రప్రదేశ్‌ బిజెపి విరుచుకుపడింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా క్ష్మీనారాయణ ను ఉద్దేశించిన విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల‌పై మండిపడుతూ ఘాటుగా విమర్శలు చేసింది. ఆయనను బ్రోకర్‌, జైలుపక్షి,కుతంత్రబుద్దిగల‌వాడని, ద్విముఖ వ్యక్తిత్వం కలిగిన వాడ‌ని హద్దుల్లో ఉండాల‌ని హెచ్చరించింది. అదే విధంగా మరో ట్వీట్‌లో సూట్‌కేస్‌రెడ్డి అని, బహుకాల‌పు జైలుపక్షి అని, రాజకీయాల్లో ఆక్కుపక్ష‌ని, వైకాపా అవినీతి మురికి గుంటలో బుడగని, ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునేవాడ‌ని, బ్రతుకంతా కేసులు`సూటుకేసులే లెక్కేసే వ్యక్తి అని, పాపం పండే టైమ్‌ వచ్చిందని విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాకు మీ వేశాలు తెలుసనని, హద్దుల్లో ఉంటే మంచిదని హెచ్చరించింది. ఒక్కసారిగా బిజెపి ఎందుకు విజయసాయిరెడ్డి పై విరుచుకుపడిందంటే…తమ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు టిడిపికి అమ్ముడుపోయారని చేసిన వ్యాఖ్యలే ఆయనపై బిజెపి దాడికి కారణం. ఈ రోజు ఉదయం విజయసాయిరెడ్డి ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ల‌క్ష్మీనారాయణ టిడిపి కి రూ.20కోట్లకు అమ్ముడు పోయారని, బిజెపి ఎంపీ సుజనాచౌదరి ఈ డీల్‌కు బ్రోకర్‌గా వ్యవహరించారని ఆరోపించురు. ఈ వ్యాఖ్యల‌తో బిజెపి భగ్గుమంది. ఒక్కసారిగా వరుసుగా బిజెపి విజయసాయిరెడ్డి ని ల‌క్ష్యంగా చేసుకుని స్ట్రాంగ్‌ కామెంట్లు చేసింది.


మొన్నటి ఎన్నికల‌ వరకు బిజెపి, వైకాపాలు లోపాయికారీగా ఒకరికొకరు సహకరించుకుని ఆ ఎన్నికల్లో టిడిపిని ఓడించారు. అయితే తరువాత కాలంలో విజయసాయిరెడ్డి చేసిన కొన్ని కామెంట్స్‌తో బిజెపి నేతలు ఆయనపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో తాము ఏమి చేసినా, పాల‌న ఎలా చేసినా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాకు చెప్పే చేస్తున్నామని ప్రకటించారు. దీనిపై అప్పట్లో బిజెపి నేతలు తప్పుపట్టారు. తరువాత కాంలో ఢిల్లీ లో విజయసాయిరెడ్డి కి కత్తెరలు పడ్డాయి. ఇంతకు ముందు పిఎంఒ చుట్టూ కనిపించే విజయసాయిరెడ్డి తరువాత కాలంలో పెద్దగా అక్కడ కనిపించడం లేదు. పైగా బిజెపి పెద్దల‌ అపాయింట్‌మెంట్‌ కూడా పెద్దగా దొరకడం లేదు. మరో వైపు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, బిజెపి ఎంపీ సుజనాచౌదిరి ఆయనతో కల‌సి మెల‌సి వ్యవహరిస్తుండడంతో వీరిని ల‌క్ష్యంగా చేసుకుని విజయసాయిరెడ్డి నేడు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. దీంతో బిజెపి మండిపడుతూ విజయసాయిరెడ్డి ని ఎండగట్టింది. కాగా..బిజెపి రాష్ట్ర నేతల్లో ఎక్కువ మంది వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నా బిజెపి ఎంపి జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు మాత్రం వైకాపానే సమర్థిస్తున్నారు. ప్రస్తుత వివాదంలో ఆయన కలుగ చేసుకుంటారో లేదో చూడాలి మరి.