స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో మత్తు వైద్యునిగా పనిచేస్తూ సస్పెండైన డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై నర్సీపట్నంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. విశాఖ ఘటనకన్నా ముందు ఏప్రిల్‌ ఆరో తేదీన నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ మీడియాతో మాట్లాడిన విషయాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి.

డాక్టర్‌ సుధాకర్‌ అరెస్టు, మానసిక ఆస్పత్రికి తరలింపు వ్యవహారంపై ప్రభుత్వం సమర్పించిన నివేదికకు, సుధాకర్‌ నుంచి వాంగ్మూలాన్ని సేకరించిన జిల్లాకు చెందిన న్యాయమూర్తి ఇచ్చిన నివేదికకు పొంతన లేకపోవడంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరిగిందో తేలాల్సిందే అంటూ హైకోర్టు పేర్కొనడం గమనార్హం. కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు ప్రభుత్వం తగిన రక్షణ పరికరాలు అందజేయలేదని డాక్టర్‌ సుధాకర్‌ గత నెల ఆరో తేదీన నర్సీపట్నం ఆస్పత్రి ఆవరణలో మీడియా ఎదుట తన ఆవేదనను వెల్లడించారు.

దీంతో సుధాకర్‌పై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆయన మీడియాతో మాట్లాడడానికి ముందు మరికొంత వ్యవహారం నడిచింది. ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా రక్షణ పరికరాలు లేని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన భావించారు.ఎమ్మెల్యే గురించి వాకబు చేయగా మునిసిపల్‌ కార్యాలయంలో వున్నట్టు తెలియడంతో సుధాకర్‌ అక్కడకు వెళ్లారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరుగుతున్న ఛాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. దీంతో అక్కడే వున్న మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు.

అంతేకాక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేరును ప్రస్తావిస్తూ….మెచ్చుకోలుగా మాట్లాడారు. ఇది న్యూస్‌ ఛానెళ్లలో ప్రసారం కావడంతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రజా ప్రతినిధులను బహిరంగంగా విమర్శించడం, తదితర అంశాలను పేర్కొంటూ వివిధ సెక్షన్ల కింద నర్సీపట్నం టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నర్సీపట్నం ఆసుపత్రిలో కరోనా రక్షణ పరికరాల కొరతపై డాక్టర్‌ సుధాకర్‌ చేసిన ఆరోపణలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కేజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, నర్సీపట్నం ఆర్డీఓ…సంయుక్తంగా విచారణ జరిపారు.

నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఇది జరిగి నెలన్నర దాటింది. కానీ విచారణ నివేదికను బహిర్గతం చేయలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ సుధాకర్‌ కేసు విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరపడానికి సీబీఐ రంగంలోకి దిగింది. విశాఖ సిటీ పోలీసులు వ్యవహరించిన తీరు, మానసిక వైద్యులు ఇచ్చిన నివేదికలతోపాటు ఈ మొత్తం వ్యవహారానికి బీజం పడిన నర్సీపట్నంలో జరిగిన పరిణామాలపైనా సీబీఐ దృష్టిసారించే అవకాశం వుందని అంటున్నారు.