అదేంటో వైసీపీకి తెల్లారిలేస్తే చంద్రబాబుని ఆడిపోసుకోవడం తప్ప మరేమీ పని లేనట్లుగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి వైసీపీకి చంద్రబాబే బలమా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. బాబుని ముందు పెట్టుకుని యుధ్ధం చేస్తేనే తప్ప జోష్ రాదేమోనన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. లేకపోతే జనం ఏ మాత్రం పట్టించుకోకుండా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చిన తరువాత కూడా వైసీపీ పదే పదే చంద్రబాబును తలవడం ద్వారా తాము తగ్గిపోతూ ఆయన్ని పెంచుతోందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు ఏపీలో లేరు. తెలంగాణాలో తన ఇంట్లో ఉంటున్నారు. రెండు నెలలుగా ఆయన ఏపీకి దూరంగా ఉంటున్నారు, కానీ ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తు సూచనలు చెప్తున్నారు. కరోనా, లాక్ డౌన్ నేపధ్యంలో చంద్రబాబు ఇలా చేస్తున్నారు. అయితే బాబు లేని బాధ, బెంగ తమ్ముళ్ళ కంటే వైసీపీకి ఎక్కువ అయిపోయినట్లుగా ఉందని అంటున్నారు. లేకపోతే బాబుని పట్టుకుని ఏపీకి ఎపుడు వస్తారూ అంటూ ప్రశ్నించడం

వైసీపీకి అలవాటుగా మారిందని కూడా అంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే కరోనా టీకా వస్తే తప్ప ఏపీకి రారా బాబుగారూ అంటూ సెటైర్లు వేయడాన్ని బట్టి చూస్తే అయన్ని మిస్ అయినట్లుగా తెగ ఫీల్ అవుతున్నారులా సీన్ ఉంది. విజయసాయిరెడ్డి మాటల్లోనే తెలుస్తోంది అంటున్నారు. బాబుని ఇప్పటికి అనేక మార్లు రాజకీయాల నుంచి తప్పుకోమని పిలుపు ఇచ్చిన విజయసాయిరెడ్డి తాజాగా ఆయన రాజకీయ సన్యాసానికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఎన్టీయార్ జయంతి వేళ చంద్రబాబు తన రాజకీయాలు స్వస్తి చెబుతూ లెంపలేసుకోవాలట. ఆయన తప్పుకుంటే మేలు అంటున్నారు వైసీపీ పెద్దాయన. అంటే చంద్రబాబు అంతటి బలవంతుడిగా కనిపిస్తున్నారా అని తమ్ముళ్ళ నుంచి రివర్స్ అటాక్ స్టార్ట్ అవుతోంది. బాబుతో తలపడే దమ్ము లేకనే ఇలా వైసీపీ నేతలు తరచూ తమ నేతను సన్యాసం తీసుకోమని అంటున్నారని కస్సుమంటున్నారు. నిజానికి వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు ఇచ్చారు. పాలించమని తీర్పు ఇచ్చారు. విపక్షం టీడీపీని సోదిలోకి కూడా లేకుండా చేశారు. మరి వైసీపీ తన పాలన తాను చేయకుండా చంద్రబాబు మీద బాణాలు గురిపెట్టడం రాంగ్ డైరెక్షన్ అంటున్నారు. చంద్రబాబుని పల్లెతు మాట అనకుండా వైసీపీ పాలన చేసుకుంటూ పోతే చంద్రబాబే ఇరకాటంలో పడతారు. అలా కాకుండా చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకుని ఆయన్ని జనంలో నిత్యం ఉండేలా వైసీపీ చేస్తోంది అంటే అక్కడే రాజకీయ వ్యూహం బెడిసికొట్టినట్లేనని అంటున్నారు. బాబును బాహుబలిగా, బలవంతుండిగా వైసీపీయే జనాల ముంచు ప్రొజెక్ట్ చేయడం తప్పుడు రాజకీయమేనని ఆ పార్టీలోనే వినిపిస్తున్న మాట.