ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు వీలుగా జగన్ సర్కార్ జారీ చేసిన ఆదేశాలను ఇవాళ ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఇచ్చిన జీవో నంబర్ 623ను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ చర్యలకు కూడా ఆదేశించింది. రంగులపై ఈ నెల 28 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు ఇచ్చిన జీవో నంబర్ 623ను హైకోర్టు కొట్టేసింది.

దీనిపై పలుమార్లు వాదనలు విన్న హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన హైకోర్టు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై గతంలో హైకోర్టు ఓసారి ప్రభుత్వ ఆదేశాలను కొట్టేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వం కొత్త రంగుల నిర్ణయానికి ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల ప్రకారం వైసీపీ రంగులతో పాటు ముదురు గోధుమ రంగును కూడా వీటికి చేర్చింది. వీటికి ప్రకృతి, వ్యవసాయాన్ని సూచించే రంగులుగా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, నీటి ట్యాంకులకు వైసీపీ రంగులు వేయొద్దని

తాము గతంలో ఆదేశాలు ఇచ్చినా వాటిని ఉల్లంఘించి రంగులు కొనసాగిచండంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టు ఉల్లంఘన చర్యలు ప్రారంభించాలని సీఎస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం రంగులు వేయడంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తీసేసి కొత్తగా ఏ రంగులు వేస్తారో, ఎప్పటికల్లా వేస్తారో తెలియచేస్తూ ఈ నెల 28 లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వానికి ఇది గట్టి షాక్ గా మారబోతోంది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకూ రంగులు వేసిన కార్యాలయాలకు తిరిగి వీటిని మార్చాలంటే దాదాపు 2వేల కో్ట్లు ఖర్చవుతుందని ఓ అంచనా. కాబట్టి దీనిపై ప్రభుత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాన్ని తిరిగి హైకోర్టుకు వివరణ రూపంలో ఇవ్వనుంది.