మాస్కుల వివాదంలో సస్పెన్షన్‌కు గురై.. ఆ తర్వాత విశాఖపట్నం మెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది.. ఇప్పటికే తన కొడుక్కి అందిస్తోన్న ట్రీట్మెంట్‌పై సుధాకర్ తల్లి కస్తూరీబాయి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టుకు ఫిర్యాదు లేఖ రాయడం చర్చగా మారింది.. సీబీఐ విచారణ కంటే ముందే తన కొడుకును నిజంగా పిచ్చివాడిగా మార్చేలా కుట్రలు జరుగుతున్నాయని, కాబట్టి, సీసీ కెమెరాల మధ్య నిపుణులైన ప్రైవేటు వైద్యులతో కోర్టు పర్యవేక్షణలో చికిత్స జరిపించాలని ఆమె హైకోర్టుకు విన్నవించుకున్నారు. అయితే, ఇప్పుడు.. విశాఖ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు… తనకు అందిస్తున్న వైద్య సేవలపై ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ సుధాకర్.. మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.. మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్‌ లేఖ రాశారు. మాస్కుల విషయం నుంచి అన్ని అంశాలను లేఖలో ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని వెల్లడించారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో పేర్కొన్నారు. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని సుధాకర్ వాపోయారు. పెదవిపై వచ్చిన మార్పులు చూపిస్తూ ఫొటోలు విడుదల చేశారు. యూరిన్‌ సమస్య కూడా ఉందని లేఖలో తెలిపారు. తనను వెంటనే వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని లేఖలో సుధాకర్ పేర్కొన్నారు.