చీరాల నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద పంచాయతీ ప్రారంభమైంది. వివిధ అంశాలపై ఇటు ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌.. అటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన సోదరుడు స్వాములు మంత్రితో భేటీ అవుతున్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే అనుచరగణంతో విజయవాడవెళ్లి మంత్రిని కలసి ఎమ్మెల్యే కరణంపై ఫిర్యాదులు చేయడంతో విషయం రచ్చకెక్కింది. చీరాల నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్‌ ఓటమి అనంతరం పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. కొద్దినెలల క్రితం ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌, అనుచరగణంతో కలిసి వైసీపీలో చేరడంతో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. సీఎం సూచనల మేరకు వ్యవహారాన్ని జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల వలంటీర్ల నియామకాల సందర్భంగా

ఇద్దరి నేతలు వారి అనుచరులకు పోస్టులు ఇప్పించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ విషయమై మంత్రి బాలినేనిని కలిశారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డు వలంటీర్ల నియామకంలో బలరాం సిఫార్సు చేసిన వారికే ఉద్యోగాలు లభించాయి. రూరల్‌ మండలంలో ఖాళీ పోస్టుల భర్తీ ఇంకా జరగాల్సి ఉంది.ఈ నేపథ్యంలో అధికారుల బదిలీల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. పోలీసు, ఇతర మరికొన్ని శాఖల్లోని కొందరు బదిలీలపై ఎమ్మెల్యే బలరాం దృష్టి సారించారు. రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయన కుమారుడు వెంకటేష్‌ ఈ వ్యవహారాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని అనుచరులతో కలిసి రెండ్రోజుల క్రితం బాలినేనిని ఆయన కలిశారు. ఆయనకు వెంకటేష్‌ బదిలీల జాబితాను అందజేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఆమంచి, ఆయన సోదరుడు అనుచరులతో కలిసి బుధవారం విజయవాడ వెళ్లారు. అక్కడ మంత్రిని కలిశారు. ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడిపై వారు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఏ విషయంలోనైనా తమ సిఫార్సులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు కూడా సమాచారం. అంతకుముందు బాలినేనిని కలిసిన వెంకటేష్‌ ఎమ్మెల్యేగా పాలనాపరమైవ్యవహారాలను చక్క బెట్టేందుకు, నియోజకవర్గ అభివృద్ధికి తన తండ్రి బలరాం చేస్తున్న కృషికి ఆమంచి అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలకు మంచిదికాదని చెప్పినట్లు తెలిసింది. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ తమ పెత్తనమే సాగేలా సహకరించాలని బాలినేనిపై ఒత్తిడి పెంచారు. ఈ విషయం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.