ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే శాఖ ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. గుజరాత్‌లోని వడోదర రైల్వే స్టేషన్‌ ఇందుకు వేదికైంది. వడోదర రైల్వే స్టేషన్‌కు రోజూ వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సహజంగా ప్రయాణాలంటేనే ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. వాడేసిన బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ‘బాటిల్ క్రషర్స్‌’ను వడోదర రైల్వే స్టేషన్‌లో రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. అయితే.. డస్ట్‌బిన్స్ ఉన్నా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేసే ఈరోజుల్లో బాటిల్ క్రషర్స్‌ను ఎంత మాత్రం వినియోగిస్తారనే సందేహం కలగడం సహజం. అందుకే రైల్వే శాఖ కొంచెం కొత్తగా ఆలోచించింది. బాటిల్ క్రషర్స్‌లో తాగి పడేసే బాటిల్‌ను వేస్తే.. బాటిల్‌కు 5రూపాయల చొప్పున పేటీఎం వ్యాలెట్‌లో జమ అవుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే. సంబంధిత మొబైల్ నంబర్‌ను ఆ మిషన్‌లో ఎంటర్ చేస్తే చాలు. బాటిల్ వేసిన కొంతసేపటికి పేటీఎంలోకి 5రూపాయలు వచ్చి పడతాయి. త్వరలోనే ఈ పధకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్స్ లో మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు. సో మీరు వాడక బాటిల్ క్రషర్ లో బాటిల్ వేసేస్తే ఐదు రూపాయిలు మీ ఖాతాలోకే.