మే 31తో లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనున్న నేపథ్యంలో లాక్‌డౌన్-5పై చర్చ మొదలైంది. దేశంలో కరోనా కేసులు లక్షన్నరకు దాటడంతో లాక్‌డౌన్ కొనసాగించాల్సిందేనన్న డిమాండ్లు వినపడుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కాకుండా కరోనా తీవ్రంగా ఉన్న నగరాల్లోనే లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జైపూర్, సూరత్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, థానే, ఇండోర్, ముంబై, పూణె,బెంగళూరు సహా మొత్తం 11 నగరాల్లో లాక్‌డౌన్- కొనసాగనుంది. ఈ నెలాఖరున ప్రసారమయ్యే మన్‌కీ బాత్ కార్యక్రమంలో లాక్‌డౌన్-5పై ప్రధాని ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

మరో రెండు వారాల పాటు కొనసాగించే లాక్‌డౌన్‌-5‌లో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో మరికొన్ని సడలింపులు ఇస్తారని తెలుస్తోంది. విద్యాసంస్థలు, సినిమాహాళ్లు మూసివేసినా దేవాలయాలు, జిమ్‌లు తెరుస్తారని సమాచారం. అన్నిరకాల దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు తెరిచేందుకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తారు. బి ప్రస్తుతం దేశంలో 1,51,769 మందికి కరోనా సోకింది. 64,426 మంది కోలుకున్నారు. 4337 మంది మరణించారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి నిష్పత్తి 42.45 శాతంగా ఉంది