ఒకవైపు బిజెపి నేతలు…రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు వేస్తారు..,రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ పాల‌న సరిగా లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తారు…ఆందోళనలు,రాస్తారోకోలు నిర్వహించి తామే ప్రభుత్వంపై పోరాటంలో ముందున్నామని చెప్పుకుంటారు. జగన్‌ ప్రభుత్వానికి తామే ప్రతిపక్షమని జబ్బులు చరుకుంటూ వీరంగాలు వేస్తున్నారు. కొంత మంది ఇలా చేస్తే…మరి కొంత మంది మాత్రం జగన్‌ అద్భుతమైన పాల‌న అందిస్తున్నారని, ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని కితాబులిస్తారు.

ఒకవైపేమో..బాగాలేదనేదీ వారే…అద్భుతం అనేదీ వారే…! ఇంత రెండు నాలుకల ధోరణిని ఏమిటని ప్రజలు విస్తుపోతున్న సమయంలో తాజాగా బిజెపికి చెందిన ఇద్దరు అగ్రనేతలు వైకాపా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోందని సర్టిఫికేట్‌ ఇస్తున్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తున్నారని, ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెబుతున్నారు.

ఏడాది పాల‌న పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఉన్నా అవి పెద్దవేమీ కాదని, వాటిని సరిదిద్దుకోవాల‌ని, అన్నిటికీ ముఖ్యమంత్రిని తప్పుపట్టడం సరికాదని విమర్శల‌కు హితవు పలికారు. దేవాదాయ ఆస్తుల‌ విషయంలో ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారని, వైకాపా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అన్ని విషయాల్లో మద్దతు పలుకుతుందని, కేంద్ర, రాష్ట్రాలు కల‌సి పనిచేస్తున్నాయని చెప్పుకున్నారు.

మరి అంత బ్రహ్మాండంగా పరిపాలిస్తుంటే బిజెపి నేతతో హైకోర్టులో కేసు వేయించడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా..మరో నేత జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు ఈరోజు ఎస్‌ఇసి విషయంలో వచ్చిన తీర్పుపై స్పందిస్తూ నిమ్మగడ్డ రమేష్‌ పార్టీల‌కు అతీతంగా వ్యవహరించాల‌ని, ఆయన టిడిపి వైపు మొగ్గుచూపుతున్నట్లు ఉండకూడదని సల‌హా ఇచ్చారు. మొత్తానికి కొంత మంది బిజెపి నేతలు..వైకాపా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతుంటే..కేంద్రంలో కీల‌క స్థానాల్లో ఉన్న రామ్‌మాధవ్‌, జివిఎల్‌ సమర్థిస్తున్నారు.