నిరుపయోగంగా ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ రంగం చేస్తోంది. ఇందుకోసం గతంలోనే టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేశారు. అప్పట్లోనే దీనిపై 8 కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. మరోవైపు టీటీడీ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీవారి ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ఆ స్థలాల్లో హిందూ ధర్మ ప్రచారం జరగాలన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన నేతల మండిపడ్డారు. న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇదిలా ఉంటె ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విమర్శలు గుప్పించారు. బైబిల్ పట్టుకుని తిరిగే జగన్ రెడ్డి టీటీడీ మరియు ఇతర హిందూ దేవాలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టటం హిందువులను అవమానించటమే అని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అన్నారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం, మీ బినామీలకు కట్టబెట్టటం కోసం ఇదో కొత్త ఎత్తుగడ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షకులు అని ప్రచారం చేసుకునే స్వరూపానంద స్వామి , చిన్నజీయర్ స్వామీ ఇతర పీఠాధిపతులు ఏమయ్యారని,? మీరు కూడా ప్రశ్నించటానికి భయపడుతున్నారా? అని పద్మశ్రీ అన్నారు.

ఎప్పుడు లేనిది ఇప్పుడు మెయింటైన్ చెయ్యలేము అని, దాతలు ఇచ్చిన భూములు, భక్తులు ఇచ్చిన కానుకులతో కొన్న టీటీడీ ఆస్తులు అమ్మకానికి పెట్టటం చేతకాని తనమని, అంత చేతగాని వారు చైర్మన్ వై .వి. సుబ్బారెడ్డి , పాలక మండలి సభ్యులు రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడేది మేమే అని ప్రగాల్భాలు పలికే భారతీయ జనతా పార్టీ , విశ్వ హిందూపరిషత్ పెద్దలు మొద్దునిద్ర పోతున్నారా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొవాలని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.