ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇక నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మే నెల నుంచీ పూర్తి జీతం ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సిఎఫ్ఎంఎస్ మార్పులు చేయనున్నది. నేటి సాయంత్రం లేదా రేపటికల్లా సిఎఫ్ఎంఎస్‌లో మార్పులు అందుబాటులోకి రానున్నాయి. గడిచిన రెండు నెలల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే చెల్లించింది. గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం, ఐఏఎస్‌లకు 40 శాతం, ప్రజా ప్రతినిధులకు అసలు జీతాలే ఇవ్వలేదు. అయితే లాక్ డౌన్‌లో భాగంగా సడలింపులు చేయడంతో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.