ఏపీలో అధికార వైసీపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. టీడీపీకి డబుల్‌ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నారని.. అక్కడే పార్టీలో చేరనున్నారని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కరణం బలరాం ఇప్పటికే వైసీపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కరణంతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారుల జాబితాలో చేరిపోయారు. ఈ ముగ్గురు కాకుండా మరో ముగ్గురిని వైసీపీ తీర్థం పుచ్చుకునేలా చేసి, శాసన సభలో టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ ఆకర్ష్‌కు తాజాగా తెరలేపినట్టు తెలుస్తుంది. వీరితో పాటు టీడీపీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు గాలం వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.