సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు చుక్కెదురైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విచారణ జూన్ 8కి వాయిదా పడింది. ఎన్జీటీలో విచారణ తరువాతే సుప్రీం కోర్టులో విచారణ ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఎన్జీటీలో న్యాయపరమైన అంశాలు లేవనెత్తేందుకు అవకాశం కల్పించింది. సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదని ఎల్జీ పాలిమర్స్ వాదనలు వినిపించగా.. ఆ విషయాలు అన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట ప్రస్తావించాలని ధర్మాసనం తెలిపింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విషవాయువు లీకేజీ ఘటనలో రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయాలన్న తీర్పుపై ఈ పిటిషన్ దాఖలైంది. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడాన్ని ఎల్జీ కంపెనీ సవాల్ చేసింది.