పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో సీఎం జగన్ స్పీడుకు కేంద్రం బ్రేకులు వేయడం.. కొత్త నీటి పథకాలపై ముందుకెళ్లకుండా ఏపీని ఆపాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కృష్ణా బోర్డుకు లేఖరాయడంతో ఇరుకునపడ్డ వైసీపీకి అనూహ్యరీతిలో మద్దతు పెరుగుతోంది. ఈ అంశంపై పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని అధినేత చంద్రబాబు ఆదేశించినా.. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రం గొంతువిప్పారు. ఊహించని రీతిలో సీఎంకు ఆయన మద్దతు పలకడంతో టీడీపీలో రచ్చ మొదలైనట్లయింది.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 400 క్యూసెక్కుల నుంచి 800 క్యూసెక్కులకు పెంచేలా కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం జారీ అయిన జీవో 203పై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం చెలరేగింది. ఒక్క టీడీపీ తప్ప అన్ని పార్టీలూ దీనిపై తమ స్టాండ్ ను స్పష్టం చేశాయి. చంద్రబాబు మాత్రం..

టీడీపీ నేతల్ని మౌనంగా ఉండాలని ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. ఈలోపే.. టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందుల నేత బీటెక్ రవి.. మొహమాటం లేకుండా తన మనసులో మాటను మీడియాతో పంచుకున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం జగన్ కు మద్దతు పలుకుతున్నానని, దానిపై జారీ అయిన జీవో 203ను సమర్థిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ రవి చెప్పుకొచ్చారు. రాయలసీమ వాసుల కోసం ఎవరు పోరాడినా అండగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే, సీమకు నీళ్లిచ్చే విషయంలో జగన్ ముందు చూపులేకుండా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. ”తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆర్థిక లావాదేవీల కోసం జగన్ గనుక పోతిరెడ్డిపాడును నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదు”అని హెచ్చరించారు. చంద్రబాబు వద్దన్న తర్వాత కూడా పోతిరెడ్డిపాడు అంశంపై బీటెక్ రవి మాట్లాడటం, అది కూడా సీఎం జగన్ ను సమర్థిస్తానని చెప్పడంపై పార్టీలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై అటు చంద్రబాబు, ఇటు వైసీపీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.