ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన్ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఆదేశించింది. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ద్వారా న్యాయం జరిగిందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.

జగన్ సర్కార్ ఏపీ ఎస్ఈసీ పదవి కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసింది.. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. తర్వాత రాష్ట్ర న్యాయ శాఖ ఆమోదం తెలపింది. వెంటనే రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పదవికాలం మూడేళ్లు గడచిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. న్యాయ శాఖ జీవో 31, పంచాయతీరాజ్ శాఖ 617, 618 జీవోలు ఇచ్చాయి. దీంతో ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవిని నుంచి తొలగించారు.

ఆ తర్వాత జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించారు. ఆ వెంటనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించారన్నారు. అలాగే టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొంతమంది కూడా పిటిషన్లు వేయగా.. కోర్టు అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేసింది.

అంతకముందు కరోనా వైరస్‌ వ్యాప్తి ఉండటంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మార్చి 15న రమేష్‌కుమార్‌ ప్రకటించారు. ఈ నిర్ణయంపై సీఎం జగన్‌, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని, వైద్యఆరోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ సీఎస్‌ నీలం సాహ్ని ఎస్‌ఈసీకి లేఖ రాశారు.