
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఎన్నికల కమిషనర్ ప్రకటన విడుదలైంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న నిమ్మగడ్డ రెండ్రోజుల్లో విజయవాడ వెళ్లనున్నారు. కాగా.. ఈ తీర్పుతో గత కొన్ని రోజులుగా మూతపడ్డ ఏపీఎస్ఈసీ కార్యాలయం తెరుచుకోనుంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించిన తర్వాత ఏపీ ఎస్ఈసీ కార్యాలయానికి జీఏడీ సీల్ వేసింది. అయితే సోమవారం ఆఫీస్ తెరుచుకోనుంది. తీర్పు అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. అన్నిరాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వ్యక్తులు కాదు.. రాజ్యాంగ సంస్థలు, విలువలు శాశ్వతమని రమేశ్ పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు.