మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తికి ముస్లింలే కారణమన్న ఒక వాదన వినిప్స్తోన్న నేపధ్యంలో పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అనూహ్యంగా పాకిస్థాన్ లో కూడా కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇరాన్ నుంచి వచ్చిన ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ద్వారా అక్కడ కరోనా సోకింది. ముందుగా ఆ స్టూడెంట్ ద్వారా కరోన ఫిబ్రవరి 26న బయటపడింది. అలా అంటించగా ఆ వైరస్ వచ్చాక కూడా వైద్యుల సూచన పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగిన ఒక 50 ఏళ్ల వ్యక్తి కరోనాతో మార్చి 18న చనిపోయాడు. అలా పాకిస్థాన్‌లో తొలి కరోనా మరణం నమోదయింది. కొత్తలో పాజిటివ్ కేసుల సంఖ్య చాలా నెమ్మదిగానే ఉన్నా మార్చి 16 తర్వాత ఊహకందని విధంగా రోగులు పెరుగుతూ వచ్చారు. ఒకానొక సమయంలో ఒక్క రోజే 178 కరోనా పాజిటివ్ రోగులను గుర్తించారు అక్కడి వైద్యులు.

అక్కడ తొలి కరోనా పాజిటివ్ కేసు గుర్తించిన నెలరోజులకే పాకిస్థాన్ లో బాధితుల సంఖ్య 18వందలు దాటేసింది. దక్షిణాసియాలో ఏ ఇతర దేశంలో కూడా లేనంతంగా పాక్ లో రోగులు పెరిగారు. వుహాన్ లో చిక్కుకున్న తమ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి పాక్ ఒప్పుకోలేదు. పైగా కరోనాపై పోరులో చైనాకు బాసటగా నిలిచింది. ఇరాన్ తో ఉన్న 960 కిలోమీటర్ల బోర్డర్ ను కూడా క్లోజ్ చేసింది. అయినా పాక్ ను కరోనాను కాటేసింది. దీనికి ప్రధాన కారణం.. తీర్థయాత్రల కోసం ఇరాన్‌కు వెళ్లి వచ్చిన పౌరులను ముందుగా హెచ్చరించకపోవడమే. ఇరాన్ లో పరిస్థితి విషమించిన తర్వాత అక్కడి నుంచి వచ్చే వారికి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే, చివరకు మనసు మార్చుకుని బెలుచిస్థాన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే 4 ,600 మందిని తఫ్తాన్ క్వారంటైన్ లో ఉంచింది. గడువు ముగిసిన తర్వాత వారికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఇళ్లకు పంపేసింది. ఇలా వెనక్కి వచ్చిన తీర్థయాత్రికుల్లో 600 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో నిర్వహించినట్లే రెండున్నర లక్షల మందితో తబ్లిగ్ జమాత్ సంస్థ.. లాహోర్ లో కూడా ఐదు రోజులపాటు మీటింగ్స్ పెట్టింది. ఈ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరినా నిర్వాహకులు వినిపించుకోలేదు. రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 12న ఈ మత కార్యక్రమాలను ఆపేశారు. తర్వాత వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసుల్లో 27 మంది ఈ మత కార్యక్రమాల్లో పాల్గొన్న వారే. గాజా స్ట్రిప్, పాలస్థీనా, కిర్గిస్థాన్ నుంచి ఈ సమావేశాలకు వచ్చిన వారిలోనూ పాజిటివ్ వైరస్ ను గుర్తించారు. పాక్ లో కేవలం 25 వేల కరోనా టెస్టింగ్ కిట్ లే ఉన్నాయి. ఇప్పటి వరకూ


14 వేల మందికి పరీక్షలు చేశారు. దీంతో కరోనా లక్షణాలు కనిపించిన వారికి మాత్రమే పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. చైనా సహా వివిధ దేశాల నుంచి లక్షన్నర టెస్టింగ్ కిట్ ల దిగుమతి కోసం పాక్ ఎదురు చూస్తోంది. మార్చి రెండో వారానికి గానీ పాకిస్థాన్ కు విషయం బోధ పడలేదు. ఒక్కసారిగా అలర్టయిన పాక్‌ సర్కార్‌ పబ్లిక్ గేదరింగ్ లు , పెళ్లిళ్లపై నిషేధం విధించి విద్యాసంస్థలు మూసివేసింది. అంతర్జాయతీ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. అయితే దేశ వ్యాప్తంగా మాత్రం లాక్ డౌన్ ప్రకటించలేదు. లాక్ డౌన్ ప్రకటిస్తే దేశంలోని పేదలు ఇబ్బంది పడతారని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతూ వచ్చారు. అయితే ఇమ్రాన్‌ నిర్ణయాన్ని పాక్ లోని వైద్య నిపుణులు తప్పుపడుతున్నారు. అయినా పాక్‌ ప్రధాని వినిపించుకోలేదు. కానీ, అదే రోజు సింధ్ ప్రావిన్స్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అనౌన్స్ చేశారు. పంజాబ్ ప్రావిన్స్ లో కేవలం దుకాణాలు మాత్రమే మూసివేయించారు. కానీ.. పాక్ ఆర్మీ ఊరుకోలేదు. పాకిస్థాన్ రాజ్యాంగ పరంగా తమకు ఉన్న అధికారాలను ఉపయోగించి కొన్ని చర్యలు చేపట్టింది. యుద్ధ సమయాల్లో వినియోగించే ఆర్టికల్ 245 ప్రకారం అధికారులపై పెత్తనం ప్రారంభించింది. ఆర్మీ రంగంలోకి దిగినా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మనసు మార్చుకోలేదు. దీంతో పాక్ లో ఆర్మీ మరోసారి పగ్గాలు చేపట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తికి ముస్లింలే కారణమన్న ఒక వాదన వినిప్స్తోన్న నేపధ్యంలో పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇలానే ఉండడంతో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న్నాయి