ఎన్టీఆర్ ఘాట్ వద్ద హీరోయిన్ పూనమ్ కౌర్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనను స్మరించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను గుర్తు చేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు.

అయితే ఆ మహానటుడికి సొంత మనవళ్లు అయినట్లువంటి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారే ఘాట్‌కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఆయన జయంతిని జరుపుకుంటే.. హీరోయిన్ పూనమ్ కౌర్ మాత్రం ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి, అంజలి ఘటించారు. ఇప్పుడిదే పెద్ద చర్చకు తావిస్తుంది.

ఒక నటిగా ఆమెకు వెళ్లే అర్హత ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అంత ప్రేమ కురిపించాల్సిన అవసరం ఏముందా? అని అంతా చర్చలు మొదలెట్టారు. ఘాట్ వద్దకు వెళ్లి రావడమే కాకుండా.. తర్వాత ఆమె చేసిన ట్వీట్ కూడా సంచలనం అవుతుంది.

‘‘ఎన్టీఆర్ జయంతి.. తెలుగు ప్రజలకు ఆరాధ్య దేవుడు.. స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి. మానవత్వం బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీ వంటి నేతలు, మీ వంటి నటుల అవసరం ఎంతో ఉంది’ అని తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌కు పలువురు నందమూరి వీరాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం ‘ఇంత ప్రేమ ఎప్పటి నుంచి మేడం గారు?’, ‘ఏంటి మళ్లీ షిఫ్ట్ అవుతున్నట్లున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.