జగన్ కు ఏమీ తెలియదు. ప్రాజెక్టుల గురించి తెలియదు. విద్యుత్తు గురించి అసలే తెలియదు. విద్యుత్తు సంస్కరణలను తెచ్చింది నేనే. 2000 సంవత్సరంలోనే విద్యుత్తు సంస్కరణలు తెచ్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచా. జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏం తెలుసు? ఎప్పుడైనా ప్రాజెక్టుల వద్దకు జగన్ వెళ్లాడా? ఇవి టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న ప్రశ్నలు.

టోటల్ గా జగన్ కు పాలన కూడా చేతకాదని తేల్చి పారేశారు. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు చంద్రబాబుకు సరైన పాయింట్ దొరికిందంటున్నారు. చంద్రబాబు విద్యుత్తు ఛార్జీల పెంపు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. విద్యుత్తు అంశం సామాన్య ప్రజల నుంచి ధనికుల వరకూ ప్రభావం చూపుతోంది. వినియోగించుకున్నప్పుడు పెద్దగా పట్టించుకోని వారు బిల్లులు చూసి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేయడం సహజం.

ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్ అవుతారు. అందుకే చంద్రబాబు విద్యుత్తు ఛార్జీలు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ఇప్పటి వరకూ చేసిన ఆందోళనలు ఒక ఎత్తయితే? విద్యుత్తు ఛార్జీల పెంపుపై నిరసన మరొక ఎత్తుగా భావిస్తున్నారు. అందుకే విద్యుత్తు ఛార్జీలపై వదలకుండా నిరసనలను తెలపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకరోజు దీక్షలతో దీనిని వదిలేయకుండా దీనిని పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని అనుకుంటున్నారు.

దీనికి సంబంధించిన స్పష్టత త్వరలోనే రానుంది. తాను హైదరాబాద్ లోనే ఉండటంతో నేరుగా ప్రజల్లో పాల్గొనలేని పరిస్థితి. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపుదల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఇప్పటికే క్యాడర్ కు పిలుపునిచ్చారు. మరోవైపు దీనిని ప్రజా ఉద్యమంగా మలచాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ప్రభుత్వంపై కేవలం రాజకీయ పార్టీల పోరాటం ఒక్కటే చాలదని, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనాలని కాల్ ఇచ్చారు. అంతేకాదు లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో పోరాడాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఇన్నాళ్లకు చంద్రబాబుకు కలసి వచ్చే అంశం దొరికినట్లయింది. మరి దీనిని చంద్రబాబు ఎలా అనుకూలంగా మలుచుకుంటారో చూడాలి.