సీఆర్‌డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై సెలెక్ట్‌ కమిటీని నియమించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మండలి చైర్మన్‌ ఆదేశాలను కార్యదర్శి పాటించేలా.. ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. శాసనమండలి చైర్మన్ ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని కోర్టుకు విన్నవించారు. మండలి ఆదేశాలను ధిక్కరించే అధికారం ఎవరికీ లేదన్నారు. వాదనల అనంతరం ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మండలి కార్యదర్శికి నోటీసులు పంపించింది. తదుపరి విచారణ వచ్చే నెల 22కి వాయిదా వేసింది.