అన్ని రాష్ట్రాలకూ వరసగా పీసీసీలను నియమిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు కూడా కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు కూడా చేసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంలో పోటీ ఎక్కువగా ఉండటం, అభ్యంతరాలు అనేకం ఉండటంతో ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చింది. త్వరలోనే పీసీసీ అధ్యక్షుడి నియామకం కాంగ్రెస్ అధిష్టానం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయింది. రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం, రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని అధిష్టానానికి చెప్పేశారు.

దీంతో అప్పటి నుంచి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. దాదాపు నాలుగు నెలల నుంచి ఈ ప్రక్రియ జరుగుతోంది.తెలంగాణ అధ్యక్ష పదవికి అనేక మంది పోటీలో ఉన్నారు. ప్రధానంగా పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మద్యే పోటీ ఎక్కువగా ఉంది. వీరిద్దరితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు వంటి వారు పీసీీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే యువకులకే ప్రాధాన్యం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించడంతో జానారెడ్డి. వీహెచ్ ల పేర్లు తొలి దశలోనే జాబితానుంచి తీసేశారు. రెడ్డి సామాజిక వర్గానికే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని హై కమాండ్ నిర్ణయించింది.దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీలో బాగానే లాబీయింగ్ చేశారు.

కానీ రేవంత్ రెడ్డికి ఇవ్వడాన్ని తెలంగాణ కాంగ్రెస్ లో దాదాపు అందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీలో జూనియర్ కావడం కూడా ఆయన మైనస్ గా మారింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించాలని పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత దూకుడుతో ఉన్నా ఆర్థికంగా బలమైన నేత కావడం వల్లనే అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.