ముఖ్య‌మంత్రిగా ఏడాది పాల‌న పూర్తి చేసుకున్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పార్టీప‌రంగా కొన్ని మార్పుల‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తల‌కు, నాయకుల‌కు దిశా నిర్దేశం చేసేందుకు, పార్టీని మరింత చురుగ్గా చేసేందుకు పార్టీ అధినేత జగన్‌ కీల‌కమైన నిర్ణయాలు తీసుకున్నారట. ఇప్పటి వరకు పాల‌నా వ్యవహారాలు, పార్టీ వ్యవహారాల‌ను చూస్తోన్న‌ జగన్‌ పార్టీ వ్యవహారాల‌ను రాజకీయ సల‌హాదారు సజ్జల‌ రామకృష్ణారెడ్డికి అప్పగించాల‌ని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటి వరకు పార్టీలో నెంబర్‌ టూగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాలు చూసేవారు. ఇప్పుడు ఆయన కేవలం ఢిల్లీ వ్యవహారాలు మాత్రమే చూడాల‌ని, ఆయన ఇప్పటి వరకు చూస్తోన్న పార్టీ వ్యహారాలు సజ్జల‌కు అప్పగిస్తూ జగన్‌ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. విజయసాయికి ఢిల్లీలో విస్తృత పరిచయాల నేపథ్యంలో ఆయన అక్కడే ఉంటె అద్భుతంగా రాణిస్తారని, పార్టీకి ప్రభుత్వానికి చాలా లాభమని జగన్ ఆలోచనగా తెలుస్తుంది.

వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసి, పార్టీని అధికారంలోకి తేవడానికి తనవంతు కృషి చేసిన సజ్జల‌ రామకృష్ణారెడ్డికి జగన్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సల‌హాదారుగా మొదటి రోజే నియమించుకున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతో మంది సల‌హాదారుల‌ను నియమించుకున్నా…వారంతా పేరుకే సల‌హాదారులుగా మిగిలిపోయారు.

ప్రభుత్వానికి సల‌హాలు ఇవ్వడంలో కానీ, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమర్థవంతంగా ప్రభుత్వ వాయిస్‌ వినిపించడంలో కానీ వారంతా విఫల‌మయ్యారు. వారికి భిన్నంగా సజ్జల‌ ప్రభుత్వ సల‌హాదారుగా రాణిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూనే, పార్టీ వ్యవహారాల్లోనూ కీల‌కంగా వ్యవహరిస్తూ, తనపై జగన్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రియాశీల‌కంగా, నమ్మకంగా పనిచేస్తోన్న సజ్జల‌ను మరింత ప్రోత్సహించాల‌నే భావనతో జగన్‌ ఆయనకు పార్టీ వ్యవహారాల‌ను అప్పగించాల‌ని నిర్ణయించినట్లు సమాచారం.

పాల‌నా వ్యవహారాల‌తో నిత్యం బిజీగా ఉంటున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ పార్టీ వ్యవహారాల‌పై దృష్టి పెట్టలేకపోతున్నారని,దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు తన తరుపున సజ్జల‌కు ఆ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఆయనకు పార్టీ బాధ్యతలు ఇస్తున్నారని తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వర్గాల‌న్నింటితో మంచి సంబంధాలు ఉన్న సజ్జల‌ పార్టీ నాయకులు, కార్యకర్తల‌ను సమన్వయం చేయగలుగుతారని, వారి అవసరాల‌ను చూస్తూ, పార్టీని నడిపించగల‌రనే నమ్మకంతో జగన్‌ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారంటున్నారు. మొత్తం మీద సౌమ్యుడిగా, వ్యవహారకర్తగా పేరున్న సజ్జల‌కు పార్టీ బాధ్యతలు అప్పచెప్పడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.