దాదాపు రెండు నెలల‌ తరువాత అమరావతికి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు షాక్‌ ఇవ్వబోతున్నారా? గత కొన్నాళ్లుగా ఏలూరి పార్టీ మారతారని అటు జిల్లాలో ఇటు రాజధానిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన గత కొన్నాళ్లుగా జిల్లాకు చెందిన మంత్రితో టచ్‌లో ఉన్నట్లు, పార్టీ మారడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆయన పార్టీ మారతారని నియోజకవర్గంలోని స్వంత పార్టీ నాయకులు, కార్యకర్తల‌తో పాటు, విపక్షానికి చెందిన నేతలు కూడా చెబుతున్నారు. వారి అంచనాల‌ను నిజం చేస్తూ ఆయన ఈ నెల‌30వ తేదీ లోపు వైకాపాలో చేరతారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్ల‌డించాయి. ఏలూరి పార్టీ మారతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా అది వాస్తవం కాలేదు. అయితే ఈసారి మాత్రం ఆయన పార్టీ మారేది ఖాయమేనని, అదీ ఈ నెలాఖరు లోపే అని ఆ వర్గాలు అంటున్నాయి.

కాగా నెలాఖరు వరకు కూడా ఆయన ఉండడం లేదని, రేపు కానీ, ఎల్లుండు కానీ ఆయన తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో పార్టీ కండువా వేసుకోబోతున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారతారని చెబుతున్నా దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి ఎదురుగాలి వీచినా, ప్రకాశం జిల్లాలో మాత్రం నాలుగు సీట్లను ఆ పార్టీ గెలుచుకోగలిగింది.

సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఏలూరి సాంబశివరావు గెలిచి సంచల‌నం సృష్టించారు. దగ్గుబాటి స్వంత నియోజకవర్గమైన పర్చూరు నుంచి రెండు సార్లు గెలిచిన ఏలూరికి ప్రజా బలం ఉంది. అయితే ఆయన్ను నమ్ముకున్న వారు తీవ్ర ఒత్తిడిలో ఉండటం, వారు ఏలూరి చెప్పలేక ఇబ్బందులు పడుతూ ఉండటంతో నమ్ముకున్న వారి కోసం పార్టీ మారాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది.

కాగా మరో రాజకీయ పరిణామం కూడా ఆయనను పార్టీ మారేలా చేస్తోందంటున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం అధికారపార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న రామనాథంను త్వరలో తొల‌గించబోతున్నారని, ఆయన స్థానంలో చీరాల‌ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు స్వాముల‌ను ఇన్‌ఛార్జిగా నియమించబోతున్నారని, ఆయన కనుక పర్చూరు వస్తే తనకు ఇక్కట్లు వస్తాయనే భావన ఏలూరిలో ఉందని, అందుకే పార్టీ మారుతున్నారని టిడిపికి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు.

స్వాములు ఇప్పటికే ఆయన సామాజికవర్గానికి చెందిన వారికి సహాయం చేసే నెపంతో నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆయనను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తే వచ్చే ఎన్నికల‌ నాటికి తనకు తీవ్రమైన పోటీ అవుతారనే భావన ఏలూరిలో ఉందని, స్వాముల‌ను అడ్డుకోవాలంటే పార్టీ మారడమే మేల‌నే అభిప్రాయానికి ఆయన వచ్చారంటున్నారు.

ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందులు తప్పడంతో పాటు, నియోజకవర్గంలో తానే బల‌మైన నేతగా కొనసాగే అవకాశం ఉండడంతో ఆయన జంప్‌ చేయబోతున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాగా పర్చూరు టిడిపిలోని ఓ వర్గం ఆయన పార్టీ మారాని బలంగా ఆకాంక్షిస్తోంది. ఆయ‌న పార్టీ మారితే త‌మ స్వంత ప‌నులు జ‌రుగుతాయ‌నే కోరికే దానికి కార‌ణం అంటున్నారు. మ‌రి వారి కోరిక త్వ‌ర‌లోనే నెర‌వేరే అవ‌కాశం ఉంది.

ఏది ఏమైనా ఏలూరి మీద రెండో దఫా ఎన్నికలు గెలిచిన మొదటిరోజు నుంచి పార్టీ మారతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏలూరి పార్టీ మారటం అనేది వైకాపా మైండ్ గేమ్ లో భాగమా? లేదా నిజమా అనేది నెలాఖరులోగా తెలిసిపోతుందిగా వెయిట్ చెయ్యండి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు, అలాగే వైకాపా నేతలు. చూడాలి ఏమవుతుందో.