మహానాడు ఈ పేరే టిడిపి కార్యకర్తల‌ను, నాయకుల‌ను ఉత్సాహపరుస్తుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తుంది. పార్టీ విధానాలు, ల‌క్ష్యాలు, సంస్థాగత ఇబ్బందులు, భ‌విష్యతుకు మార్గ‌ద‌ర్శకాలు తదితర అంశాల‌ను చర్చించుకునేందుకు పార్టీ క్రమం తప్పకుండా దీన్ని నిర్వహిస్తూంటుంది. అన్న ఎన్టీఆర్‌ నుంచి నేటి దాకా టిడిపి నిర్వహించే మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు ఏవీ ఇటువంటి కార్యక్రమాల‌ను నిర్వహించవు. కేవలం పార్టీ కార్యకర్త సమావేశాలు, నాయకు సమావేశాలు నిర్వహించి మమ అనిపిస్తాయి. కానీ టిడిపి నిర్వహించే మహానాడు ఒక కుటుంబ కార్యక్రమంలా ఉంటుంది. పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తులు, అభిమానులుఈ కార్యక్రమానికి పోటెత్తుతారు. పార్టీ ఎన్నికల్లో గెలిచినాఓడినాఎన్ని ఇబ్బందులు ఉన్నామహానాడు మాత్రం యధావిధిగా సాగిపోతూనే ఉంటుంది. పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు జరుగుతూనే ఉంది.

అయితే ఈసారి కరోనా మమ్మారి పుణ్యాన మహానాడును జూమ్‌ యాప్‌ ద్వారా జరపబోతున్నారు. పార్టీ అధ్యక్షుడు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు జూమ్‌ ద్వారా మహానాడులో పాల్గొనబోతున్నారు. మహానాడు అంటే వేలాది మంది ఒకే చోట చేరి పార్టీ విషయాలు మాట్లాడుకుని కడుపారా భోజనాలు చేసి, పార్టీ విధానాల‌ను, స్ధానిక విష‌యాల‌ను చర్చించుకుంటూ సాయంత్రం వరకు ఆనందంగా గడిపే సందర్భంగానే పార్టీ వారికి తెలుసు. అయితే ఈసారి మాత్రం దానికి విరుద్ధంగా ఎవరి ఇంట్లో వారు ఉండిజూమ్‌ యాప్‌ ద్వారా పార్టీ అధ్యక్షుడు, ఇతర నాయకుల‌ ప్రసంగాల‌ను విని ఆనందించాల్సి ఉంటుంది. అక్కడ నుంచే తాము చెప్పాల‌నుకున్న విషయాల‌ను చెప్పాల్సి ఉంటుంది. తొలిసారిగా నిర్వహించే ఈ జూమ్‌ మహానాడు ఎలా ఉండబోతోందన్న దానిపై పలువురు నాయకులు, కార్య‌క‌ర్త‌లు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని ఏడాది కావస్తున్న సందర్భంలో నిర్వహిస్తున్న మహానాడులో ఏం చర్చించబోతున్నారనే దానిపై కూడా వారిలో ఆసక్తి నెల‌కొంది. గత ఏడాది అప్పుడే ఎన్నికలు జరిగి ఉండడంతోమహానాడును నిర్వహించలేకపోయారు. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితు వ‌ల్ల‌ నేరుగా మహానాడును జరపలేక యాప్‌ ద్వారా జరుపతుండడంతో కార్యకర్తలు చెప్పే విషయాల‌న్నీ నాయకుల‌కు చేరతాయా? లేదాఅనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది అధికారంలోకి వ‌చ్చిన వైకాపా నుంచి ఎదురౌతున్న స‌వాళ్ల‌ను తిప్పికొట్ట‌డంతో పాటు, వారి నుంచి ఎదురౌతున్న దాడుల‌ నుంచి కార్యక‌ర్త‌లను కాపాడుకోవ‌డం, వారిలో స్థైర్యాన్ని నూరిపోయ‌డమే ల‌క్ష్యంగా పార్టీ మ‌హానాడును నిర్వ‌హించ‌బోతోంది.

వివిధ నియోజ‌క వ‌ర్గాల్లో క్రియాశీల‌కంగా లేని వారిని క్రియా శీలం చేయడం, ప‌ని చేయ‌ని వారిని ప‌క్క‌న పెట్టడం, ఇన్ఛార్జ్ లు లేని చోట కొత్త‌వారికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అందించే అంశాన్ని చ‌ర్చించ‌బోతున్నారు. వైకాపా ఏడాది వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం, వారి దౌర్జన్యాలపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌ర‌చ‌డంపై చ‌ర్చించ‌బోతున్నారు. సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు న‌మోదు చేస్తోన్న కేసులపై వారికి దిశానిర్ధేశం చేయ‌బోతోంది. మొత్తం మీద టెక్నాల‌జీని వాడుకుని నిర్వ‌హించ‌బోయే జూమ్‌ మహానాడు దేశంలోనే ఒక చరిత్ర అవుతుంది. ఒక రాజకీయ పార్టీ ఆ స్థాయిలో సమావేశం నిర్వహించటం ఇదే మొదటి సారి అవ్వటంతో టిడిపి శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి.