మరి కొద్దిరోజులు తరువాత చంద్రబాబుకున్న ప్రతిపక్ష హోదా పోవటం ఖాయమని ఇటీవల మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను టిడిపి నేతలు కొట్టి పారేస్తున్నా..ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటానికి మళ్లీ ఆపరేషన్‍ ఆకర్ష ప్రారంభించారని బయటకు పొక్కింది. ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపిపిలను, మాజీ జడ్పీటిసిలను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించి.. జగన్‍ పార్టీలో చేర్పించేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన కుమారుడు కరణం వేంకటేష్‍లకు బాధ్యతలను అప్పజెప్పినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా బయటకు పొక్కింది. మళ్లీ ఆపరేషన్‍ ఆకర్షను ప్రకాశం జిల్లాలో పాలకులు ప్రారంభించినట్లుగా టిడిపి అభ్యర్ధులు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో కొందరు టిడిపి ముఖ్య నేతలు పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెబుతుండగా..

మరి కొందరు నాయకులు జగన్‍ పార్టీనేతలతో మాటలు కలుపుతున్నారట. ముఖ్యంగా టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఆపరేషన్‍ ఆకర్ష ప్రారంభించారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కరణం బలరాం.. ఆయన కుమారుడే జగన్‍ పార్టీలో చేరారు. ఆయన ద్వారానే ఆ ఎమ్మెల్యేలను జగన్‍ పార్టీలో చేర్పించేందుకు రంగం సిద్దమైందని టిడిపి నేతలు చెప్పుకుంటున్నారు. రాజకీయంగా, అధికారంగా, వ్యాపారంగా అండదండగా నిలిచిన తెలుగుదేశం అధినేతను కరణం బలరాం.. ఆయన కుమారుడు దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటే.. రాజకీయంగా నైతిక విలువలకు వారిద్దరు తిలోదకాలు ఇచ్చారని స్పష్టమవుతోందంటున్నారు టిడిపి నేతలు.

కానీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ పార్టీ మారేందుకు సిద్దంగా లేరు. ఎన్నికష్టాలు ఎదురైనా.. చంద్రబాబుతోనే ఉంటాం.. అని వారు తెగేసి చెబుతున్నట్లు జగన్‍ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కూడా జగన్‍ పార్టీలో చేర్పించేందుకు కరణం ప్రయత్నిస్తున్నారని వారితో ఆయన టచ్‍లో ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే ఆ మాజీ ఎమ్మెల్యేలతో నిత్యం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో.. ఇదంతా పధకం ప్రకారం జగన్‍ పార్టీ నేతలు మైండ్‍ గేమ్‍ ఆడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‍ ముఖ్యమంత్రి అయి సంవత్సరం కావస్తుంది. ఇప్పటి వరకు వేదింపులు, సాదింపులకు పాల్పడినా.. పార్టీని వీడేందుకు అంగీకరించని వారు ఇప్పుడెందుకు అంగీకరిస్తారు. ఏది ఏమైనా.. తెలుగుదేశం పార్టీ క్యాడర్‍లో గందరగోళం సృష్టించేందుకు జరుగుతున్న మైండ్‍గేమ్‍తో ముందు ముందు ఏ సంఘటనలు జరగబోతున్నాయో వేచి చూడాల్సిందే.