రాజ‌కీయాల్లో నాయ‌కులు ఒక‌టి త‌లిస్తే.. జ‌రిగేది మ‌రోలా ఉంటుంది. ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు సీనియ‌ర్ నాయ‌కుడు, రాష్ట్ర రాజ‌కీయాల్లో పాత‌త‌రం నాయ‌కుడు, మంచి పేరు సంపాయించుకున్న గాదె వెంక‌ట‌రెడ్డి కుటుంబం కూడా చ‌విచూస్తోంది. కాంగ్రెస్‌లో ప్రారంభ‌మైన గాదె వెంకటరెడ్డి రాజ‌కీయాలు నేడు వైసీపీలోకి చేరాయి. కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో త‌నే ఎంతో మందిని ప్రోత్స హించాన‌ని చెప్పుకొనే గాదెను ఇప్పుడు ప్రోత్సహించే వారు లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో బాప‌ట్ల నుంచి విజ‌యం సాధించి రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు గాదె వెంక‌ట రెడ్డి. మంత్రిగా కూడా వైఎస్ హ‌యాంలో ప‌నిచేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన నాయ‌కుడుగా, గ‌ట్టి కాంగ్రెస్‌వాదిగా పేరు తెచ్చుకున్న గాదె వెంక‌ట రెడ్డి రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్‌తో విభేదించారు. అయినా కూడా పార్టీ రాష్ట్రాన్ని విభ‌జించింది.

ఈ నేప‌థ్యంలోనే కొన్నాళ్లు ఆయ‌న అదే పార్టీలోఉన్నప్పటికీ.. 2014 ఎన్నిక‌ల్లో పోటీ కి దూరంగా ఉన్నారు. ఆ త‌ర్వాత చంద్రబాబు పంచ‌న చేరిపోయారు. నిజానికి గాదె ల‌క్ష్యం త‌న త‌రం వార‌సుడిగా ఆయ‌న కుమారుడు గాదె మ‌ధుసూద‌న రెడ్డిని రాజ‌కీయంగా నిల‌బెట్టాల‌నేది ఆయ‌న ప్రణాళిక‌. ఈ క్రమంలోనే బాప‌ట్లపై ఆయ‌న దృష్టి పెట్టారు. 1967 నుంచి ప్రకాశం జిల్లా ప‌ర్చూరులో రాజ‌కీయం చేసిన ఆయ‌న 2004లో ఆ సీటును ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావుకు త్యాగం చేసే క్రమంలో ఆయ‌న బాప‌ట్లకు మారారు. అక్కడ రెండుసార్లు గెలిచిన గాదె వెంక‌ట రెడ్డి మంత్రి అయ్యారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల త‌ర్వాత టీడీపీలో చేరిన గాదె 2019 సీటును త‌న కుమారుడికి వ‌స్తుంద‌ని ఆశించారు. అయితే, చంద్రబాబు వారికి ఆ అవ‌కాశం ఇవ్వలేదు. అన్నం స‌తీష్ కుమార్‌కే ఇచ్చారు. అయితే, ఆయ‌న ఓడిపోయారు. అంతేకాదు, త‌ర్వాత ప‌రిణామాల‌తో ఆయ‌న పార్టీ మారి బీజేపీ పంచ‌న చేరిపోయారు. దీంతో తీవ్రస్థాయిలో చంద్రబాబుపై అలిగిన గాదె వెంక‌ట రెడ్డి

సైలెంట్‌గా వ‌చ్చి వైసీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే త‌మ కుమారుడిని వైసీపీ అధినేత జ‌గ‌న్ చేతుల్లో పెట్టారు. అయితే, వీరి దృష్టి అంతా కూడా బాప‌ట్ల లేదా ప్రకాశం జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ప‌రుచూరుపై ఉంది. కానీ, ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో బాప‌ట్లలో డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి బ‌లంగా ఉన్నారు. వైసీపీకి ఆయ‌న అత్యంత విశ్వాస‌పాత్రుడు. దీంతో ఆయ‌న‌ను అక్కడి నుంచి త‌ప్పించి గాదె వెంక‌ట రెడ్డి కుమారుడికి ఎట్టిప‌రిస్థితిలోనూ అవ‌కాశం ఇచ్చేది లేదు.సామాజిక వ‌ర్గాల ప‌రంగా బ్రాహ్మణులు బ‌లంగా పాతుకుపోవ‌డం క‌ష్టం. అలాంటిది కోన బాప‌ట్లలో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచి స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక, ప‌రుచూరు విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ వైసీపీ పాగా వేయాల‌ని భావిస్తున్నా.. బ‌ల‌మైన టీడీపీ నాయ‌కుడు, వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న ఏలూరి సాంబ‌శివ‌రావు ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీకి అతిర‌థ‌మ‌హార‌థులు ఓడిపోయినా..ఈయ‌న మాత్రం ఇక్కడ విజ‌యం సాధించారు.

మ‌రి ఇలాంటి టీడీపీ కంచుకోట‌ను గాదె వెంక‌ట రెడ్డి కుమారుడికి అప్పగిస్తే.. ఏమేర‌కు పుంజుకుంటాడ‌నేది సందేహ‌మే అంటున్నారు వైసీపీలో కీల‌క నాయ‌కులు. దీనికి తోడు జిల్లాలో ఉన్న సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా పరుచూరు బాధ్యత‌ల‌ను క‌మ్మ వ‌ర్గానికే ఇవ్వాల‌న్నది జ‌గ‌న్ ప్లాన్‌. ఈ లెక్కన ప‌రుచూరులో సైతం గాదె ఆశ‌లు నెర‌వేరేలా లేవు. దీంతో ఇప్పటికీ కూడా గాదె వెంక‌ట రెడ్డి కుమారుడి భ‌విత‌వ్యంపై ఎలాంటి క్లారిటీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.