మహానాడు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగల‌బోతోంది అంటూ వైకాపా మైండ్ గేమ్ కి తెర తీసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మహానాడుకి ముస్తాబు అయ్యి ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సిద్ధం ఐన టిడిపిమీద వైకాపా మైండ్ గేమ్ మొదలు పెట్టింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార వైకాపా తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఇలాంటి మైండ్ గేమ్స్ మాకేం కొత్త కాదని టిడిపి శ్రేణులు కొట్టిపారేస్తున్నారు.

నిన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటపెట్టుకుని వస్తున్నారని, నిన్ననే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపాలో చేరతారని చెప్పుకొచ్చారు. వీరు కాకుండా విశాఖకు చెందిన వాసుపల్లి గణేష్‌కుమార్‌(విశాఖ సౌత్‌), గణబాబు(విశాఖ వెస్ట్‌), గంటా శ్రీనివాసరావు (విశాఖనార్త్‌), గొట్టిపాటి రవికుమార్‌(అద్దంకి),

బాల‌ వీరాంజనేయు(కొండిపి) జోగేశ్వరరావు(మండపేట), పయ్యావుల‌ కేశవ్‌ (ఉరవకొండ), బి.అశోక్‌ (ఇచ్చాపురం) వంటి ఎమ్మెల్యేలు వైకాపా అధినేతతో మాట్లాడుకున్నారని, వీరందరూ మహానాడు రోజున వైకాపాలో చేరతారని అంటున్నారు. ఇప్పటికే ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు వైకాపా తీర్థం పుచ్చుకోగా..ఇప్పుడు మరో 10మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరతారని అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరుపున మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు గెల‌వగా వారిలో సగానికి పైగా వైకాపాలో చేరబోతుండడం గమనార్హం.

వీరందరూ చేరకపోయినా…మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వైకాపాలో చేరితే ప్రస్తుతం ప్రతి పక్షనాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ప్రతిపక్షనేత హోదా పోతుంది. ఈ హోదాను పోగొట్టేందుకు వైకాపా పెద్దలు వీరందరినీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. మరో వైపు పార్టీ ఎమ్మెల్యేల‌ ఫిరాయింపుల‌పై సామాన్య కార్యకర్తలు వైకాపా మైండ్ గేమ్ అని అర్ధం చేసుకున్నారు.

ఒక వేళ వార్తలు నిజమైనా ఎమ్మెల్యేపై పార్టీ ఆధారపడి లేదని, కార్యకర్తల‌పైనే పార్టీ ఆధారపడి ఉందని..వీరుపోతే కొత్త నాయకత్వాన్ని త‌యారు చేసుకుంటామనే వారు భరోసాతో ఉన్నారు.