
తెలంగాణలో మే 31 వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కట్టడి ప్రాంతాలు మినహా అన్ని జోన్లను గ్రీన్జోన్లుగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. కట్టడి ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. 1,452 కుటుంబాలకు కట్టడి ప్రాంతాల్లో ఉన్నాయని, కట్టడి ప్రాంతాల్లోని ప్రజలంతా సహకరించాలని కేసీఆర్ కోరారు. కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.లాక్డౌన్ వరకూ ఫంక్షన్ హాల్స్, మాల్స్, సినిమా హాళ్లు బంద్ ఉంటాయని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. అలాగే సభలు, ర్యాలీలు, సమావేశాలకు కూడా అనుమతి ఇవ్వబోమని వెల్లడించారు. వీటితో పాటు బార్స్, పబ్స్, క్లబ్స్, జిమ్‌లు, స్టేడియాలు, పార్క్‌లు బంద్ ఉంటాయన్నారు. అన్ని విద్యాసంస్థలను మూసివేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ ధరించకపోతే
రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. షాపుల యజమానులు శానిటైజేషన్ చేయించాలని తెలిపారు. ఇక అనవసరంగా ప్రజలు రోడ్లపైకి రావొద్దని కోరారు. మళ్లీ తిరగబడితే లాక్‌డౌన్‌కు వెళ్లాల్సి వస్తుందని వివరించారు. 65 ఏళ్లు దాటిన వారిని, చిన్నారులను బయటికి రానివ్వొద్దని స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణ పాటిద్దాం.. కరోనా నుంచి కాపాడుకుందాం అని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. ఇక ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతి లేదన్నారు. హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ట్యాక్సీ, ఆటోల్లో ముగ్గురు ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఇక ఈనెల 31 వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపబోమన్నారు. కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అన్ని షాపులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. సరిబేసి సంఖ్యలో మాత్రమే షాపులు తెరవాలన్నారు. అలాగే కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో సెలూన్లు ఓపెన్ చేయొచ్చని తెలిపారు. ఈ- కామర్స్ సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వందశాతం పనిచేస్తాయన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, తయారీ యూనిట్లు పనిచేస్తాయని వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 31 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. అన్ని ప్రార్థనామందిరాలకు అనుమతి లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.