తెలంగాణా నుంచి విడిపోయాక ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయింది. పారిశ్రామికీకరణతో ఏపీ దశ, దిశ మార్చాలంటే ఇపుడే కుదిరేది కాదు, పైగా ఏపీలో టూ టైర్, త్రీ టైర్ సిటీలే ఉన్నాయి. దాంతో ఆ వైపుగా మౌలిక సదుపాయాలు పెంచుకోవాలి. ఈ లోగా వ్యవసాయానికి ఊతమిస్తే ఏపీ చాలావరకూ ముందుకు వెళ్తుంది. దానికి సాగినీటి ప్రాజెక్టులు పూర్తి చాలా అవసరం. పోలవరం విషయంలో జగన్ తగిన సలహాలు, సూచనల కోసం తన తండ్రి కాలం నాడు పనిచేసిన రమాకాంతరెడ్డిని ముఖ్య సలహాదారుగా నియమించబోతున్నారని తెలుస్తోంది. ఆయన వైఎస్సార్ రెండవమారు ముఖ్యమంత్రి అయినపుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి ఏపీకి వ్యవహరించారు. ఇక ఆయన ఆ తరువాత ఉమ్మడి ఏపీకి ఎన్నికల ప్రధానాధికారిగా కూడా పనిచేశారు. జగన్ పై సీబీఐ పెట్టిన కేసులు పూర్తిగా నిరాధారమైనవని చాలా టీవీ డిబేట్లలో వాదించిన రమాకాంతరెడ్డి వైఎస్ కుటుంబానికి అతి ముఖ్య సన్నిహితుడుగా ఉంటున్నారు. ఆయన్ని పోలవరం ప్రాజెక్ట్ కు సలహాదారుగా నియమించడం ద్వారా తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది జగన్ ఆలోచన. అంతకు ముందు 1980లలో నాటి ముఖ్యమంత్రి అంజయ్య టైంలో శంకుస్థాపన రాయి వేసినా చంద్రబాబు 70% పైన

పూర్తి చేసారు. మరో వైపు చూసుకుంటే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ట తెచ్చేది కూడా పోలవరమేనని జగన్ బాగా నమ్ముతున్నారు. జగన్ సర్కార్ కి ఇప్పటికే ఎందో మంది సలహాదారులు ఉన్నారు. అయితే రమాకాంతరెడ్డి కధ వేరు. ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాదు, ఉమ్మడి ఏపీ గురించి పూర్తిగా తెలుసు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఆయనకు పూర్తి అవగాహన‌ ఉంది. అదే విధంగా ఆయన విలువైన సూచనలతో పోలవరం తొందరగా పూర్తి అవుతుందని జగన్ నమ్ముతున్నారు. ఇక తండ్రి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్ ని తనయుడు జగన్ పూర్తి చేస్తారు అని మంత్రి కన్నబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఘనత అంతా నాటి వైఎస్, నేటి జగన్ కే దక్కుతుంది తప్ప తెలుగుదేశానికి కానే కాదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా చూస్తే జగన్ సర్కార్ కి ప్రాణవాయువు పోలవరం అని తెలుస్తోంది. అందుకే దాన్ని తమ కుటుంబానికి నమ్మకంగా ఉన్న రమాకాంతరెడ్డికి జగన్ అప్పగించారు, దీన్ని వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారూ.