టీటీడీ భూముల వేలంపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరిచ్చారు. తమకు నిందలు కొత్తేమీ కాదని, తిరుమల కొండకు తాము సేవకులుగా వెళ్లామని చెప్పారు. ఎలాంటి నిందలు వేసినా తట్టుకునేశక్తి తకుందని స్పష్టం చేశారు. తిరుమల వెంకన్నకు రాజకీయాలు ఆపాదించొద్దని హితవుపలికారు. తమకు దోచుకోవాలన్న ఆలోచన ఉంటే.. టీటీడీ భూములనే అమ్మాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని సుబ్బారెడ్డి సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములు, కనకదుర్గమ్మ భూములు కొట్టేయాలని చూశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధులను కాపాడే ప్రయత్నం చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు హయాంలో అప్పనంగా భూములు ఇచ్చారని, టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్తకాదని చెప్పారు. టీటీడీ ఆస్తులను కాపాడటంలో భాగంగానే సమీక్షలు జరిపామని సుబ్బారెడ్డి తెలిపారు.