ఇటీవల కాలంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తల‌పై పలువురు సోషల్‌ మీడియా ద్వారా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, కోర్టుల‌కు, న్యాయమూర్తుల‌కు కళంకాన్ని అంటిస్తున్నారని, అటువంటి వారిపై సుమోటోగా చర్యలు తీసుకోవాల‌ని హైకోర్టు న్యాయవాది వి.వి.ల‌క్ష్మీనారాయణ కోర్టుకు విన్నవించారు. గౌరవనీయ న్యాయమూర్తుల‌పై అసభ్యమైన వ్యాఖ్యల‌తో పాటు, వారి గౌరవాన్ని, కోర్టుల‌ విశ్వసనీయతను దెబ్బతీయడమే ల‌క్ష్యంగా వారు సోషల్ మీడియాలో దుప్రృచారాన్ని సాగిస్తున్నారని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని న్యాయవ్యవస్థపై ప్రజల‌కు ఉన్న నమ్మకాన్ని నిల‌బెట్టాల‌ని ఆయన కోరారు. తాను 1994 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నానని, కోర్టులు, న్యాయమూర్తుల‌ గౌరవాన్ని కాపాడడం తన విధి, బాధ్యతగా భావించి అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాని కోరుతున్నానని పేర్కొన్నారు. న్యాయమూర్తుల‌ను అవమానించే విధంగా, వారిపై ప్రజల్లో అపోహలు కల్గించడమే ల‌క్ష్యంగా ‘దొండిడి వెంకటరామిరెడ్డి, కిషోర్‌రెడ్డి దరిసా, బాల‌కృష్ణారెడ్డి కుతతి మరియు జల‌గం వెంకటసత్యనారాయణ’లు ఫేస్‌బుక్‌, వాట్స్‌యాప్‌, ఇతర సోషల్‌ మీడియా విభాగాల‌ ద్వారా ప్రచారం చేస్తున్నారని వీరందరిపై చర్యలు తీసుకుని న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల‌ని ఆయన కోరారు. పైన పేర్కొన్న వ్యక్తుల‌ పోస్టు చేసిన వ్యాఖ్యల‌ను లేఖతో ఆయన జతపరిచారు. న్యాయవ్యవస్థపై వారు చేస్తోన్న దాడిని అరికట్టాల‌ని, ఇలాంటి వ్యక్తుల‌పై చర్యలు తీసుకున్నప్పుడే న్యాయవ్యవస్థ విశ్వాసాన్ని నిల‌బెట్టుకుంటుందని, గౌరవ న్యాయస్థానం వీరిపై సుమోటోగా కేసు నమోదు చేయాల‌ని ల‌క్ష్మీనారాయణ కోరారు.