మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. ప్రత్యేక కేసుగా పరిగణించి హైదరాబాద్‌ నుంచి వచ్చేందుకు ఆయనకు అనుమతి ఇస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదివారం సాయం త్రం ప్రకటించగా.. ఏపీకి విమానాల సర్వీసుల ప్రారంభాన్ని సోమవారం నుంచి మంగళవారానికి వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు విశాఖ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒక చేత్తో పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. విమాన సర్వీసులు మొదలుకాకుండా మోకాలడ్డడం ద్వారా ఆయన పర్యటనను దొంగచాటుగా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. నిజానికి సోమవారం నుంచి విమాన సర్వీసులు నడపడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

దీంతో ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను సోమవారం పరామర్శించాలని బాబు నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. విశాఖకు విమానంలో రావడానికి 2 తెలుగు రాష్ట్రాల డీజీపీలకు అనుమతి కోసం లేఖలు రాశారు. తెలంగా ణ ప్రభుత్వం వెంటనే ఇవ్వగా.. మన రాష్ట్ర ప్రభుత్వం నాన్చుతూ.. ఆదివారం సాయంత్రం అనుమ తించింది. దీంతో విశాఖలో చంద్రబాబు ఎక్కడెక్కడ ప ర్యటించాలో ఖరారుచేసి టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశా రు.

అయితే ఇంతలోనే ఏం జరిగిందో.. సోమవారం విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడం లేదని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) ఆదివారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకే విమానాల సర్వీసులను సోమవారం నుంచి మంగళవారానికి వాయిదావేశామని పౌరవిమానయాన మంత్రి హర్దీ‌ప్‌సింగ్‌ పురి ట్వీట్‌ చేశారు.

చంద్రబాబు విశాఖకు రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం ఇలా చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదీగాక చంద్రబాబు, లోకేశ్‌ పర్యటనకు డీజీపీ సోమవా రం వరకే పాస్‌ ఇచ్చారు. మంగళవారం రావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసినా ఎప్పటికి అనుమతిస్తారో తెలియదు. ఈ నేపథ్యంలోనే హై దరాబాద్‌ నుంచి సోమవారమే అమరావతికి రోడ్డుమార్గంలో వచ్చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన వెంట లోకేశ్‌ రానున్నారు. విమానాల రాకపోకలను కేవలం ఒక్కరోజు వాయిదా వేయడంతో కరోనా వ్యాప్తిలో వచ్చే మార్పు ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బుధ, గురువారాల్లో టీడీపీ మహానాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రేనని ఆరోపిస్తున్నారు.

సమయం తక్కువగా ఉన్నందున మంగళవారం విమాన సర్వీసు లు ప్రారంభమైనా.. చంద్రబాబు ఆ రోజు విశాఖకు రా రన్న అంచనాతోనే ప్రభుత్వం ఈ ఎత్తుగడ పన్నిందని వారు విమర్శిస్తున్నారు. చంద్రబాబు పర్యటనపై ప్రభుత్వం వైపు నుంచి రకరకాల సమాధానాలు వినిపించాయి. పర్యటనకు అనుమతి కావాలని బాబు అసలు దరఖాస్తు పెట్టనేలేదని హోం మంత్రి సుచరిత ఆదివారం మీడియాకు చెప్పారు. కానీ ఆయన దరఖా స్తు పెట్టారని, అనుమతిస్తున్నామని డీజీపీ చెప్పారు.