విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి రోజు (మే 28)న ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీయార్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి కుదరడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీయార్ ఘాట్ వద్ద కాకుండా ఇంటి దగ్గరే ఎన్టీయార్‌కు నివాళులర్పించాలని జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నారు. జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ గురువారం ఎన్టీయార్ ఘాట్‌కు రావడం లేదని ప్రముఖ పీఆర్వో, నిర్మాత మహేష్ కోనేరు ట్విటర్ ద్వారా తెలియజేశారు. `ప్రజలు, అభిమానుల భద్రత దృష్ట్యా ఎన్టీయార్, కల్యాణ్‌రామ్ రేపు ఎన్టీయార్ ఘాట్‌కు రావడం లేదు. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారికి ఇంటి దగ్గరే నివాళులు అర్పిస్తారు. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులు గుంపులుగా ఉండకూడదనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నార`ని ట్వీట్‌లో పేర్కొన్నారు.