అధికార వైకాపా ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు పరిపాలించలేదని, ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ ప్రజల‌ను హింసిస్తోన్న వైకాపా ప్రభుత్వానికి త్వరలోనే నూకలు చెల్లుతాయ‌ని, తిరిగి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్‌కు తాము వారసులం కాదని, పార్టీ కార్యకర్తలే ఆయన వారసుల‌ని బాల‌కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా అన్న అనుమానం వస్తోందని, ఎక్కడలేని విధ్వంసం జరుగుతోందని ఆయన ఆక్షేపించారు. అన్న ఎన్టీఆర్ కలల‌ను చంద్రబాబు సాకారం చేస్తున్నారని, తాను ప్రజల‌కు, పార్టీ కార్యకర్తల‌కు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తానని, ప్రజలు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన వారికి భరోసా ఇచ్చారు.