లాక్‌డౌన్‌ ముగింపు దశకు చేరడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెందిన నేతలను లాక్కోవడంపై అధికార పార్టీ వైసీపీ మళ్లీ దృష్టి కేంద్రీకరించింది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో వైసీపీ నేత లు రాయబారాలు నడిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గురు, శుక్రవారాల్లో టీడీపీ మహానాడు జరగనుంది. ఆ సమయానికి ఎమ్మెల్యేలను ఫిరాయింపచేయడం ద్వారా ఆ పార్టీని నీరసపర్చాలన్నది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు మాట్లాడుతు న్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు దక్షిణ కోస్తా ప్రాంతానికి చెందిన వారే.

ఈ ఇద్దరూ పార్టీ మారబోతున్నారని కొంతకాలం క్రితం ముమ్మరంగా ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆ పరిణామం జరగలేదు. ఇప్పుడు మళ్లీ అదే ప్రచారం తెరపైకి వచ్చింది. వైసీపీలో నంబర్‌-2గా ప్రచారంలో ఉన్న నేత వారిద్దరితో మాట్లాడారని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారని అంటున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యేపై కూడా వైసీపీ నేతలు గురిపెట్టి ఒత్తిడి పెంచుతున్నారని ప్రచారం జరుగుతోంది.

విలేకరులు అడిగినప్పుడు ఈప్రచారం అంతా అబద్ధమని ఈ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. అదేసమయంలో అధికార పార్టీ నుంచి విపరీతమైన ఒత్తిడి ఉందనీ చెబుతున్నారు. దక్షిణకోస్తాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సన్నిహితులైన టీడీపీ నేతలను ఈ పరిణామంపై సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు అనుకొన్నట్లు అన్నీ సవ్యంగా జరిగితే మహానాడు ప్రారంభమయ్యే గురువారం ఫిరాయింపులు ఉండొచ్చని అంటున్నారు.